ఓ యువకుడిని ఓ గ్యాంగ్ కనికరం లేకుండా కొడుతున్న షాకింగ్ వీడియో వైరల్‌గా మారింది. తమిళనాడులోని కరూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న 22 ఏళ్ల అనీష్ అనే యువకుడిని ఇద్దరు వ్యక్తులు సంప్రదించారు, దొంగిలించబడిన బైక్ గురించి అతనితో మాట్లాడాలని పిలుచుకుని వెళ్లారు. అనంతరం కరూర్ జిల్లాలోని వీరరక్కియంలోని ఓ ప్రదేశానికి బలవంతంగా తీసుకెళ్లారు. పది మంది వ్యక్తుల బృందం అనిష్‌ను చుట్టుముట్టింది. అతనిని కొట్టడం మొదలు పెట్టి.. బైక్ దొంగిలించినట్లు ఒప్పుకోమని బెదిరించారు.
ఒకరు ఈ భయానక సంఘటనను రికార్డ్ చేశారు. వీడియోలో ఆ బృందం అనిష్‌పై కర్రలతో దాడి చేయడం, చెప్పుతో కొట్టడం, పదేపదే తన్నడం చూడవచ్చు. అంత క్రూరంగా దెబ్బలు తిన్నాక కూడా ఒప్పుకోలేదు. తనను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లమని ముఠాతో వేడుకున్నాడు. కొట్టిన తర్వాత అనిష్‌ను ఆ ముఠా అతని ఇంటి దగ్గర వదిలిపెట్టింది. కొడుకు ఒంటిపై ఉన్న దెబ్బలను చూసిన అనిష్ తండ్రి మాయనూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తదుపరి విచారణ జరుగుతోంది.