ప్రధాని భద్రతా వైఫల్యంపై దర్యాప్తుకు స్వతంత్ర కమిటీ

Supreme Court Set up a Committee to Probe PM Security lapse. భారతప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనకు వెళ్ళినప్పుడు సెక్యూరిటీ బ్రీచ్ వ్యవహారం

By Medi Samrat  Published on  10 Jan 2022 10:25 AM GMT
ప్రధాని భద్రతా వైఫల్యంపై దర్యాప్తుకు స్వతంత్ర కమిటీ

భారతప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనకు వెళ్ళినప్పుడు సెక్యూరిటీ బ్రీచ్ వ్యవహారం దేశం మొత్తాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే..! ఈ ఘటన వెనుక కుట్ర ఉందని ఆరోపించే వారు కూడా లేకపోలేదు. ఇది చివరికి సుప్రీం కోర్టు దాకా చేరింది. దీనిపై కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్, పంజాబ్ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. భద్రతా లోపంపై సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో విచారణ కమిటి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సుప్రీం కోర్టు ప్రతిపాదనపై కేంద్ర సొలిసిటర్‌ జనరల్‌, పంజాబ్‌ అడ్వకేట్‌ జనరల్‌ ఇద్దరూ తమకు అభ్యంతరం లేదని చెప్పారు. విచారణ కమిటిలో సభ్యులుగా చండీగఢ్ డీజీపీ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, ఎన్ఐఏకు చెందిన ఐజీ, ఐబీ అధికారులు కూడా ఉంటారని, కమిటీలో పంజాబ్ నుంచి కూడా ప్రతినిధ్యం ఉంటుందని సీజేఐ ఎన్వీ రమణ వెల్లడించారు.

పంజాబ్ ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్ జనరల్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీపై తమకు నమ్మకం లేదని, స్వతంత్ర విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. సుప్రీంకోర్టులో విచారణకు ముందే పంజాబ్‌ అధికారులను దోషులుగా చిత్రీకరిస్తూ షోకాజ్‌ నోటీసులు ఇచ్చారని ధర్మాసనానికి ఏజీ తెలియజేశారు. సీజేఐ స్పందిస్తూ దోషులుగా చిత్రించి చర్యలు తీసుకుంటూ.. షోకాజ్‌ నోటీసులు ఇచ్చిన తర్వాత తాము విచారణ చేపట్టాల్సిన అవసరం ఏముందని కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రధాని భద్రతకు సంబంధించిన విషయంపై ఎస్‌పీజీ చట్టం ప్రకారం సంబంధిత అధికారులను ప్రశ్నించే అధికారం కేంద్రానికి ఉందంటూ సొలిసిటర్‌ జనరల్‌ సమాధానం ఇచ్చారు. ప్రధాని పర్యటన ముందుగానే ఖరారైందని, వాతావరణ పరిస్థితుల దృష్ట్యానే రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారని, ఆ విషయం కూడా ముందుగానే రాష్ట్ర ఏజన్సీలకు సమాచారం ఇచ్చినట్లు ఎస్‌జీ తెలిపారు.

ప్రధాని వాహనశ్రేణికి ముందు ఉన్న సెక్యూరిటీ వాహనం 100 మీటర్ల సమీపానికి వచ్చే వరకు పంజాబ్‌ అధికారులు రోడ్డు క్లియర్‌గా ఉందని తప్పుడు సమాచారం ఇచ్చారని సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. ప్రధాని భద్రత వ్యవహారం కాబట్టే తమ ముందుకు వచ్చిన పిటిషన్‌ను విచారణకు తీసుకున్నామని, అయితే కేంద్రం ముందుగానే ఫలానా అధికారులు బాధ్యులు అంటూ చర్యలకు ఉపక్రమిస్తే ఇక తాము విచారణ చేపట్టేది ఏముంటుందని సీజేఐ ఎన్వీ రమణ ప్రశ్నించారు. కేంద్రానికి చెందిన ఏ ఏజెన్సీ విచారణ చేపట్టినా వాస్తవాలు వెలుగులోకి రావని, స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఒకవేళ రాష్ట్ర అధికారులు దోషులుగా తేలితే తనను, తన ప్రభుత్వ అధికారులకు శిక్ష వేయాలని పంజాబ్ అడ్వకేట్ జనరల్ వాదించారు.

భద్రతా ఉల్లంఘన ఘటనపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని నియమిస్తామని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. ఈ కమిటీలో డీజీపీ చండీగఢ్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఇన్‌స్పెక్టర్ జనరల్, పంజాబ్, హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, పంజాబ్ అదనపు డీజీపీ ఉండనున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు హిమా కోహ్లీ, సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.


Next Story