జనవరి 5న పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా భద్రతా ఉల్లంఘనలపై విచారణకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ప్యానెల్‌ను నియమించింది. వీలైనంత త్వరగా విచారణ నివేదికను సమర్పించాలని జస్టిస్ మల్హోత్రా కమిటీని సీజేఐ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు సూర్యకాంత్, హిమ కోహ్లీలతో కూడిన ధర్మాసనం కోరింది. జస్టిస్ మల్హోత్రా నేతృత్వంలోని విచారణ ప్యానెల్‌లో సభ్యులుగా ఎన్ఐఏ డీజీ లేదా ఐజీ స్థాయి అధికారి, చండీగఢ్ యూటీ డీజీపీ, పంజాబ్ డీజీపీ, పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉంటారు.
కోర్టు ఆదేశాల మేరకు సేకరించిన అన్ని రికార్డులు, పత్రాలను విచారణ ప్యానెల్‌కు సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను సుప్రీంకోర్టు కోరింది. భద్రతా ఉల్లంఘనకు గల కారణాలు, దానికి బాధ్యులైన వ్యక్తులు, భవిష్యత్తులో వీవీఐపీల భద్రతా ఉల్లంఘనలను నివారించడానికి తీసుకోవలసిన చర్యలపై ప్యానెల్ విచారిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అంతకుముందు సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిటీలతో విచారణ సాగించవద్దని కోరింది.