తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు నవంబరు 30న పోలింగ్ జరగనుండగా.. ప్రధాన పార్టీలన్నీ ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా తెలంగాణకు వస్తున్నారు. రాష్ట్రంలో రాహుల్ మూడ్రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో రాహుల్ పర్యటన ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే మాట్లాడుతూ.. అక్టోబరు 18న ములుగు నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. మహిళా డిక్లరేషన్ లో భాగంగా రాహుల్ గాంధీ, ప్రియాంక ప్రసంగిస్తారని వివరించారు. కరీంనగర్, పెద్దపల్లిలో పాదయాత్ర, బహిరంగ సభల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. జగిత్యాల, ఆర్మూర్ లో రైతులతో రాహుల్ సమావేశం కానున్నారని.. నిజామాబాద్ లో పాదయాత్ర, బహిరంగ సభ ఉంటాయని ఠాక్రే వెల్లడించారు.