Rahul Gandhi : తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో గెలుస్తాం.. రాజస్థాన్‌లో కూడా..
By Medi Samrat Published on 24 Sep 2023 9:52 AM GMTఒకే దేశం, ఒకే ఎన్నికలు అనే అంశంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఇది దృష్టి మరల్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నమని రాహుల్ అన్నారు. దేశంలో పెద్దఎత్తున నిరుద్యోగం, అట్టడుగు వర్గాల వారికి అన్యాయం వంటి సమస్యలే ప్రధాన సమస్యలని, అయితే బీజేపీ మాత్రం సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుందన్నారు.
ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో కచ్చితంగా గెలుస్తున్నామని అన్నారు. రాజస్థాన్‌లో కూడా గెలుపుకు దగ్గరగా ఉన్నామని, గెలవగలమని భావిస్తున్నామని చెప్పారు.
పార్లమెంటులో మనం వింటున్న రమేష్ బిధూరి ప్రకటన బిజెపి కుట్ర అని రాహుల్ గాంధీ అన్నారు. నిషికాంత్ దూబే ప్రకటన కూడా.. కుల గణన నుండి దృష్టి మళ్లించేందుకే బిజెపికి తెలిసే ఇచ్చిందని ఆయన అన్నారు.
కర్నాటకలో మనం చాలా ముఖ్యమైన పాఠం నేర్చుకున్నామని.. దృష్టి మళ్లించడం ద్వారా బీజేపీ మనల్ని తమ కథల్లో బంధించి ఎన్నికల్లో గెలుపొందాలని చూస్తుందని.. బీజేపీ అబద్ధాలను ప్రచారం చేయలేని విధంగా కర్ణాటకలో ఎన్నికల్లో పోరాడామని రాహుల్ అన్నారు.