ఒకేసారి 11 వైద్య కళాశాలలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
PM Narendra Modi to virtually inaugrate 11 Government Medical Colleges in Tamil Nadu today. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులో 11 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను
By Medi Samrat
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులో 11 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ఈరోజు ప్రారంభించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాయంత్రం 4 గంటలకు కళాశాలలను ప్రారంభించనున్నారు. కొత్త వైద్య కళాశాలలలో మొత్తం 1,450 సీట్లు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం ఉన్న జిల్లా/రిఫరల్ ఆసుపత్రికి అనుబంధంగా కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు జరుగుతుందని తెలిపింది. పీఎంవో షేర్ చేసిన డేటా ప్రకారం.. మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల సంఖ్య 387 నుండి 596కు పెరిగింది. ఎంబీబీఎస్ సీట్లు 79.60 శాతం (51,348 సీట్ల నుండి 92,222 సీట్లకు) పెరిగాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ల సంఖ్య 80.70 శాతం (31,185 సీట్ల నుండి 56,374 సీట్లకు) పెరిగింది.
11 మెడికల్ కాలేజీలతో పాటు, చెన్నైలో సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ (CICT) కొత్త క్యాంపస్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం సీఐసీటీ అద్దె భవనంలో పని చేస్తోండగా.. ఇకపై కొత్త క్యాంపస్ నుండి పనిచేస్తుంది. సాంప్రదాయ భాషలను ప్రోత్సహించడానికి.. భారతీయ వారసత్వాన్ని రక్షించడానికి ఈ చొరవ తీసుకోబడిందని తెలుస్తోంది. తమిళనాడులోని విరుదునగర్, నమక్కల్, నీలగిరి, తిరుప్పూర్, తిరువళ్లూరు, నాగపట్నం, దిండిగల్, కళ్లకురిచ్చి, అరియలూరు, రామనాథపురం, కృష్ణగిరి జిల్లాల్లో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటవుతున్నాయి. రూ. 4,000 కోట్ల అంచనా వ్యయంతో ఈ కళాశాలలు స్థాపించబడుతున్నాయి. ఇందులో రూ. 2,145 కోట్లు కేంద్ర నిధులు.. మిగిలిన మొత్తాన్ని తమిళనాడు ప్రభుత్వం భరిస్తుంది.
వైద్య విద్యను ప్రోత్సహించడానికి, దేశవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి 11 వైద్య కళాశాలల స్థాపన జరుగుతుంది. అలాగే ఈరోజు ప్రారంభించబడే సీఐసీటీలో 45,000కు పైగా ప్రాచీన తమిళ పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. ఇది సాంప్రదాయ తమిళం ప్రచారం కోసం పరిశోధనలు చేయడంలో సహాయపడుతుందని ప్రభుత్వం పేర్కొంది.