ప్రధాని మోదీ నామినేషన్.. ఈ రోజే ఎందుకంటే..

ప్రధాని మోదీ నేడు నామినేషన్ దాఖలు చేయ‌నున్నారు. గంగా స్నానం, భైరవ ఆలయాన్ని సందర్శించడం.. ఆ తర్వాత 'పుష్య నక్షత్రం'లో ప్రధాని వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేయ‌నున్నారు.

By Medi Samrat  Published on  14 May 2024 9:27 AM IST
ప్రధాని మోదీ నామినేషన్.. ఈ రోజే ఎందుకంటే..

ప్రధాని మోదీ నేడు నామినేషన్ దాఖలు చేయ‌నున్నారు. గంగా స్నానం, భైరవ ఆలయాన్ని సందర్శించడం.. ఆ తర్వాత 'పుష్య నక్షత్రం'లో ప్రధాని వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేయ‌నున్నారు. మంగళవారం గంగా సప్తమి సందర్భంగా గంగా నదిలో ప్రధాని పుణ్యస్నానం ఆచరిస్తారు. ఈ రోజున ఏ పని చేసినా కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. పుష్య నక్షత్రంలో చేసే ఏ పని అయినా శుభప్రదంగా పరిగణించబడుతుంది. విజయానికి అవకాశం ఉంటుంది.

ఉదయం నామినేషన్ పత్రాల దాఖలుకు ముందు 9 గంటల ప్రాంతంలో గంగా తీరంలోని దశాశ్వమేధ ఘాట్‌లో మోదీ ప్రార్థనలు చేస్తారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు నమో ఘాట్‌కు వెళ్తారు. అక్కడి నుంచి కాలభైరవ ఆలయానికి వెళ్లి.. ఆ తర్వాత ఎన్డీయే నేతలతో కూడా సమావేశం కానున్నారు. ఆపై నామినేషన్ దాఖలు చేసేందుకు కలెక్టరేట్‌కు వెళ్లనున్నారు. ప్రధాని మోదీ నామినేషన్ కార్య‌క్ర‌మానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, 18 మంది క్యాబినెట్ మంత్రులు హాజ‌రుకానున్నారు. నామినేషన్ తర్వాత ప్రధానమంత్రి పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు.

ఇదిలావుంటే.. సోమవారం సాయంత్రం తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో మదన్ మోహన్ మాలవ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. ఆరు కిలోమీటర్ల మేర జరిగిన ఈ రోడ్ షోలో ప్రజలు పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. రెండున్నర గంటల పాటు సాగిన ఆరు కిలోమీటర్ల రోడ్ షోను ముగించుకుని కాశీ విశ్వనాథ్ ధామ్ ఆలయానికి ప్రధాని మోదీ చేరుకున్నారు.

Next Story