మోదీతో మీటింగ్ లో కేజ్రీవాల్ వ్యాఖ్యల కలకలం
PM Modi objects to 'protocol break' during meeting. ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన కోవిడ్ సమీక్షా సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి
By Medi Samrat Published on 23 April 2021 7:53 PM ISTప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన కోవిడ్ సమీక్షా సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని కేజ్రీవాల్ అన్నారు. ఆక్సిజన్ కొరత చాలా ఎక్కువగా ఉందని... పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరారు. పరిస్థితులు చేయిదాటిపోతే, మహా విషాదం తప్పదని అన్నారు. ఆక్సిజన్ సరఫరా ఆగిపోయి, రోగి కొనఊపిరితో ఉన్నప్పుడు ఆ పరిస్థితి గురించి తాను ఎవరితో మాట్లాడాలని ప్రశ్నించారు. కొన్ని రాష్ట్రాలు ఆక్సిజన్ రవాణా వాహనాలను ఆపేస్తున్నాయని... ఈ విషయంలో కేంద్రం రాష్ట్రాలతో మాట్లాడాలని కేజ్రీవాల్ కోరారు. ఢిల్లీ ముఖ్యమంత్రిని అయినప్పటికీ తాను ఏమీ చేయలేకపోతున్నానని.. రాత్రంతా నిద్ర పట్టడం లేదని అన్నారు. ఢిల్లీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా తనను క్షమించాలని కోరారు. దేశంలోని ఆక్సిజన్ ప్లాంట్లను సైన్యం స్వాధీనం చేసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ టెలికాస్ట్ చేయడం పట్ల ప్రధాని అసహనం వ్యక్తం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ మాట్లాడుతుండగా ప్రధాని కల్పించుకుని 'ఏం జరుగుతోంది. ఇది మన సంప్రదాయానికి పూర్తిగా విరుద్ధం' అంటూ లైవ్ టెలికాస్ట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే అరవింద్ కేజ్రీవాల్ తేరుకుని క్షమాపణలు చెప్పారు.
అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు, వాటిని ఆమ్ ఆద్మీ పార్టీ టెలికాస్ట్ చేయడం వివాదం కావడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) వివరణ ఇచ్చింది. ప్రధానితో సమావేశం ప్రసారం చేయరాదని లిఖితపూర్వకంగా కానీ, మౌఖికం కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి తమకెలాంటి ఆదేశాలు లేనందున సీఎం ప్రసంగాన్ని లైవ్‌లో షేర్ చేశామని తెలిపింది.