ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. తన కార్యక్రమం ప్రారంభంలోనే ప్రధాని మోదీ పహల్గామ్ దాడిని ప్రస్తావించారు. పహల్గామ్‌లో జరిగిన ఈ దాడి వల్ల గుండె తీవ్ర మనో వేదనకు గురైందన్నారు. మన దేశ ప్రజలలో ఉన్న కోపం ప్రపంచం మొత్తానికి కూడా ఉందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ దారుణమైన ఉగ్రదాడిని అందరూ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచం మొత్తం 140 కోట్ల మంది భారతీయులకు అండగా నిలుస్తోంది. దాడి బాధితులకు న్యాయం చేస్తామని ప్రధాని మోదీ అన్నారు.
ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఇందులో 27 మంది పర్యాటకులు మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఉగ్రవాదుల దాడి తర్వాత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రూరమైన ఉగ్రదాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని, కఠినంగా శిక్షిస్తామని అమిత్ షా అన్నారు.
ఉగ్రదాడిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) ఈ మేరకు పాకిస్తాన్‌పై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశ భద్రతకు సంబంధించిన అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కీలక చర్యలకు ఆమోదం తెలిపింది. ఆ దేశంతో దౌత్య సంబంధాలు పూర్తిగా తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. పాక్ పౌరులు, పర్యాటకులు వారం రోజుల్లో తమ దేశానికి వెళ్లిపోవాలని ప్రకటించింది. అటారీ చెక్‌పోస్టును వెంటనే నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. పాక్ పౌరులను భారత్‌లోకి అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. ఇక 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది.