ప్రధాని మోదీ పర్యటనకు ముందు కశ్మీర్ లో..!
Officer Dead In Jammu Encounter Ahead Of PM's Visit. ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్ పర్యటన నేపథ్యంలో ఉగ్రవాదులు భారీ దాడులకు కుట్ర పన్నారు
By Medi Samrat Published on 22 April 2022 2:32 PM ISTప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్ పర్యటన నేపథ్యంలో ఉగ్రవాదులు భారీ దాడులకు కుట్ర పన్నారు. ప్రధాని పర్యటనకు 48 గంటల ముందే ఓ ఎన్ కౌంటర్ జరగడంతో ఆందోళన రేకెత్తుతోంది. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భారీ ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందని నిఘా విభాగం ముందే అప్రమత్తం చేయడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. జమ్మూలోని సంజ్వాన్ సైనిక చెక్ పోస్టు వద్ద ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక సీఐఎస్ఎఫ్ అధికారి చనిపోగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. చనిపోయిన జవానును ఏఎస్సై ఎస్.పి. పటేల్ గా గుర్తించారు. మరణించిన వారిలో ఒక వ్యక్తి ఆత్మాహుతి దాడి చేసేందుకు ఒంటిపై బాంబులను చుట్టుకున్నాడని, నగరంలో ఫిదాయీ తరహా దాడులకు కుట్ర పన్నాడని అధికారులు చెప్పారు. తెల్లవారుజామున 3.45 గంటలకు ఉగ్రవాదులు ఓ ఇంట్లో చొరబడి సైన్యంపై కాల్పులు జరిపారని, బదులుగా సైన్యమూ కాల్పులు జరిపిందని తెలిపారు.ప్రస్తుతం మరింత మంది ఉగ్రవాదుల కోసం గాలింపు జరుగుతోందని పేర్కొన్నారు.
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ ప్రాంతంలో ముందు జాగ్రత్త చర్యగా మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులను నిలిపేశారు. డ్రోన్లను రంగంలోకి దించి ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు చేస్తున్నారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ సాంబా జిల్లాలోని పాళి గ్రామంలో పర్యటించనున్నారు. అక్కడ బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా ఉగ్రవాదులు భారీ ఉగ్రదాడికి కుట్రపన్నినట్టు తెలుస్తోంది.
బారాముల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బారాముల్లా సమీపంలోని మాల్వా ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందడంతో ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడడంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో లష్కరే తోయిబా అగ్ర కమాండర్ యూసుఫ్ కంత్రూతో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రత్యేక పోలీసు అధికారి, అతడి సోదరుడు, ఓ జవాను సహా పలువురు పౌరుల హత్యల్లో కంత్రూ ప్రమేయం ఉన్నట్టు కశ్మీర్ జోన్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు జవాన్లు స్వల్పంగా గాయపడినట్టు ఆయన పేర్కొన్నారు.