మోదీ, అమిత్ షా ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నారు: రాహుల్‌గాంధీ
దేశంలో ప్రస్తుతం సత్యం–అసత్యాల మధ్య తీవ్ర పోరాటం సాగుతోందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు
By - Knakam Karthik |
మోదీ, అమిత్ షా ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నారు: రాహుల్‌గాంధీ
ఢిల్లీ: దేశంలో ప్రస్తుతం సత్యం–అసత్యాల మధ్య తీవ్ర పోరాటం సాగుతోందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యలు దేశపు మౌలిక విలువలకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. సత్యానికి బదులుగా అధికారానికే ప్రాధాన్యం ఇస్తున్న భావజాలానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. అండమాన్–నికోబార్‌లో మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత తన ప్రసంగ ప్రణాళికనే మార్చుకున్నానని రాహుల్ గాంధీ వెల్లడించారు. గాంధీజీ చూపిన మార్గం సత్యమేనని, ‘సత్యం శివం సుందరం’, ‘సత్యమేవ జయతే’ అన్నది భారతీయ ధర్మాల సారమని గుర్తుచేశారు. కానీ ప్రపంచం సత్యాన్ని కాదు, శక్తినే చూస్తుందని మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్య ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచనా ధోరణిని ప్రతిబింబిస్తోందన్నారు.
నరేంద్ర మోదీ, అమిత్ షా నేతృత్వంలోని ప్రభుత్వం అధికారాన్ని నిలుపుకునేందుకు ఓట్ల దొంగతనానికి పాల్పడుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల సమయంలో డబ్బులు పంచుతూ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఎన్నికల కమిషన్ కూడా బీజేపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోందని ఆరోపించారు. జ్ఞానేశ్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సాంధు, వివేక్ జోషి అనే ఎన్నికల కమిషనర్లు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్లకు రక్షణ కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని మార్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని రద్దు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల కమిషనర్లు మోదీ ప్రభుత్వానికి కాదు, దేశ ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు.
హర్యానాలో జరిగిన ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బ్రెజిల్‌కు చెందిన ఒక మహిళ పేరు ఓటర్ల జాబితాలో 22 సార్లు కనిపించిందని, ఒకే పోలింగ్ బూత్‌లో ఒక మహిళ 200 సార్లకు పైగా నమోదైందని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేతలు హర్యానాలో ఓటు వేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ అంశాలపై ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. ఓటు దొంగతనం కేవలం ఎన్నికల మోసం కాదని, అది డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంపై దాడి అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ‘ఒక వ్యక్తి – ఒక ఓటు’ అనే మౌలిక సూత్రాన్ని బీజేపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందన్నారు. ఓటు దొంగతనం చేయకపోతే ప్రజలు ఐదు నిమిషాల్లోనే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేవారని వ్యాఖ్యానించారు.
దేశంలో రెండు భావజాలాల మధ్య పోరాటం సాగుతోందని రాహుల్ గాంధీ అన్నారు. ఒకటి అధికారానికి ఏదైనా చేసే ఆర్‌ఎస్‌ఎస్ భావజాలమైతే, మరొకటి సత్యం, అహింస, ప్రజాస్వామ్య విలువలను నమ్మే కాంగ్రెస్ భావజాలమన్నారు. చివరికి సత్యమే గెలుస్తుందని, అహింస మార్గంలోనే మోదీ–షా ప్రభుత్వాన్ని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.