యూట్యూబ్‌లో చూసి రూ. 10 కోట్ల విలువైన దొంగతనం.. విచారణలో సంచలన విషయాలు
Learned to steal on youtube.. and blew away 10 crore diamonds and gold jewelry. తమిళనాడు వెల్లూరులోని ఓ నగల దుకాణంలో 15 కిలోల బంగారం దోచుకెళ్లిన యువకుడిని
By Medi Samrat
తమిళనాడు వెల్లూరులోని ఓ నగల దుకాణంలో 15 కిలోల బంగారం దోచుకెళ్లిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగ యూట్యూబ్ ద్వారా దోచుకోవడం నేర్చుకున్నాడని తెలుసుకున్న పోలీసులు ఖంగుతిన్నారు. వెల్లూరులోని ఓ నగల దుకాణంలో చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు.. ఐదు రోజుల పాటు ముమ్మరంగా గాలించి చివరకు పట్టుకున్నారు. డిసెంబర్ 15న అలుక్కాస్ జ్యువెలరీ షాపులో దోపిడీ జరిగింది. ఈ ఘటనలో 15 కిలోల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు దొంగలు. సీసీటీవీ ఫుటేజీలో ఓ వ్యక్తి సింహం ముసుగు ధరించి, స్ప్రే పెయింట్ ద్వారా సీసీటీవీ కెమెరాల రికార్డింగ్‌ను ఆపేందుకు ప్రయత్నించి దోపిడీకి పాల్పడినట్లు కనిపించింది.
పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన ఈ దోపిడికి సంబంధించి విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో భాగంగా దాదాపు 200 సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. దొంగతనం జరిగిన ప్రాంతంలో ఎటువంటి అలారం మోగలేదు. ఆ ప్రాంతంలో ఎవరూ అనుమానాస్పదంగా కూడా కనిపించలేదు. ఐదు రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్న పోలీసులకు సోమవారం ఫలితం దక్కింది. నిందితుడిని కూచిపాళయం గ్రామానికి చెందిన 22 ఏళ్ల తిఖారామ్‌గా గుర్తించారు.
నిందితుడిని ప్రశ్నించగా.. యూట్యూబ్‌లో వీడియో చూసి తిఖారామ్ దోపిడీకి ప్లాన్ చేసి అమలు చేశాడని తెలియడంతో పోలీసులు ఖంగుతిన్నారు. జ్యువెలరీ షాపు గోడకు శబ్దం రాకుండా రంధ్రం చేసేందుకు టిఖారామ్ 10 రోజుల సమయం తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడు యూట్యూబ్‌లో చూసి తనను గుర్తుపట్టకుండా ఏం చేయాలో, సీసీటీవీని ఎలా బ్లాక్ చేయాలో నేర్చుకున్నాడు. టీఖారామ్ బంగారాన్ని కరిగించే యంత్రాలను కూడా కొనుగోలు చేసి ఒడుకత్తూరు శ్మశాన వాటికలో దాచాడు. త్వరగా సంపన్నుడు కావాలనుకున్న తిఖారామ్ ప్లాన్ బయటపడటంతో పోలీసుల వలలో చిక్కుకున్నాడు. అతని వద్ద నుంచి దాదాపు రూ.10 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు లభ్యమయ్యాయి. అతనిపై ఐపీసీ 457, 380 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.