కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా మాట్లాడుతూ తెలంగాణ-ఏపీ ప్రభుత్వాలు విభజన హామీలను నెరవేర్చుకోవాలని సూచించారు. గడిచిన 9 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరించిందని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర సాయం ప్రజలకు వివరించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుతూనే వున్నామని కిషన్ రెడ్డి అన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టింపులకు పోవద్దని ఆయన సూచించారు.
బీజేపీ లేకుంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించామని చెప్పారు. పార్లమెంట్‌లో సుష్మస్వరాజ్ నేతృత్వంలో 160 మంది బీజేపీ ఎంపీలు తెలంగాణ పక్షాన నిలబడ్డారని గుర్తు చేశారు. బీజేపీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని ఓ సందర్భంలో బీఆర్ఎస్ ఎంపీ కేకే చెప్పారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఇతర పార్టీల కంటే ముందే కాకినాడలో తీర్మానం చేశామని అన్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వత తరుఫున గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ గవర్నర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతాయని స్పష్టం చేశారు.