ప్రధాని మోదీ 'సబ్ కా సాథ్-సబ్ కా వికాస్' నినాదం మొత్తం 'బోగస్'

భారత ప్రధాని నరేంద్ర మోదీ సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ నినాదం మొత్తం బోగస్ అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.

By Medi Samrat  Published on  23 Dec 2023 10:13 AM GMT
ప్రధాని మోదీ సబ్ కా సాథ్-సబ్ కా వికాస్ నినాదం మొత్తం బోగస్

భారత ప్రధాని నరేంద్ర మోదీ సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ నినాదం మొత్తం బోగస్ అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. గతంలో బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం విధించిన హిజాబ్‌పై నిషేధాన్ని సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం తాజాగా ఎత్తివేసింది. మహిళలు తమకు నచ్చిన దుస్తులు ధరించవచ్చని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధారణపై ఉన్న నిషేధాన్ని తమ ప్రభుత్వం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు.

మైసూర్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన సిద్ధరామయ్య ప్రధాని మోదీ ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ నినాదం మొత్తం బోగస్ అని అన్నారు. బట్టలు, వేషం, కులాల ప్రాతిపదికన ప్రజలను, సమాజాన్ని విభజించే పనిలో బీజేపీ ఉందన్నారు. ఎవరైనా హిజాబ్ ధరించి పాఠశాలలు, కళాశాలలకు వెళ్లవచ్చు.. హిజాబ్‌ను నిషేధిస్తూ తీసుకున్న గత ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని సిద్ధరామయ్య వ్యాఖ్యలు చేశారు. హిజాబ్‌పై నిషేధం ఎత్తివేస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చింది కాంగ్రెస్‌. అధికారంలోకి వచ్చాక ఆ నిర్ణయాన్ని అమలు చేసింది. గత ప్రభుత్వం విధించిన హిజాబ్‌పై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. హిజాబ్ తప్పనిసరి అన్న నిబంధన ఇస్లాంలో లేదంటూ కర్ణాటక హైకోర్టు హిజాబ్‌పై నిషేధాన్ని సమర్థించింది. విద్యాసంస్థల్లో అందరికీ ఒకేరకమైన వస్త్రధారణ ఉండాలని కూడా సూచించింది. ఈ అంశంపై ప్రస్తుతం సుప్రీం కోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.

Next Story