చైనా-పాక్ లకు షాకిచ్చేలా అమెరికాతో భారత్ డీల్
India To Buy First US Armed Drones At $3 Billion. అమెరికా సాయుధ డ్రోన్లను భారత్ కొనుగోలు చేయనుంది
By Medi Samrat Published on 10 March 2021 3:45 PM GMTభారత్ కు పక్కనే ఉన్న దేశాలైన చైనా-పాక్ లు ఎన్నో కుతంత్రాలు పన్నుతూ ఉన్న సంగతి తెలిసిందే..! పాకిస్థాన్ భారత్ లోకి తీవ్రవాదులను పంపించడానికి చేసే కుయుక్తులను భారత్ ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంది. ఇక భారత భూభాగాన్ని ఆక్రమించుకోడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలను భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. ఇక చైనా, పాకిస్థాన్ లకు చెక్ పెట్టేందుకు భారత్ సరికొత్త ప్రణాళికతో ముందుకు వెళ్లబోతోంది. అమెరికా సాయుధ డ్రోన్లను భారత్ కొనుగోలు చేయనుంది. అందుకు సంబంధించిన భారీ డీల్ జరగనుంది.
సముద్ర, భూ రక్షణ వ్యవస్థలను పటిష్ఠం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న భారత్ శాన్ డయీగోకు చెందిన జనరల్ ఆటమిక్స్ తయారు చేసిన ఎంక్యూ 9బీ ప్రిడేటర్ డ్రోన్లను కొనుగోలు చేయనుంది. ఏప్రిల్ నెలలో 30 డ్రోన్ల కొనుగోళ్లకు సంబంధించి 300 కోట్ల డాలర్లతో భారత్ ఒప్పందం చేసుకోబోతోందని సమాచారం అందించింది. గత ఏడాది ఆయుధాల్లేని రెండు ఎంకూ 9 ప్రిడేటర్ డ్రోన్లను భారత్ లీజుకు తీసుకోగా.. ఇప్పుడు సాయుధ డ్రోన్లను కొనుగోలు చేయడం భారత రక్షణ వ్యవస్థలో ఒక ట్రేడ్ మార్క్ గా మారనుంది.
1,700 కిలోల పేలోడ్ లను మోసుకెళ్లే ఈ డ్రోన్లు 48 గంటల పాటు ఆగకుండా గస్తీ కాయగలవని నిపుణులు చెబుతున్నారు. హిందూ మహా సముద్రం దక్షిణ ప్రాంతంలో చైనా నౌకలపై నిఘా వేసేందుకు మన నౌకాదళానికి ఇవి బలంగా మారుతాయని అంటున్నారు. హిమాలయ పర్వత సానువుల్లోని సరిహద్దుల వద్ద పాక్ లక్ష్యాలనూ వీటితో టార్గెట్ చేసుకోవడానికి వీలుంటుందని చెబుతున్నారు. ఇక ఈ భారీ డీల్ పై రక్షణ శాఖ, జనరల్ ఆటమిక్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సాయుధ డ్రోన్లను అమెరికా ఎంత బాగా ఉపయోగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐసిస్ పైనా, తాలిబన్లను తుదముట్టించడానికి చాలా వరకూ ఈ డ్రోన్లు ఉపయోగపడ్డాయి. భారత్ కూడా వీటిని దేశ రక్షణ కోసం ఉపయోగించనుంది.