తమిళనాడు రాష్ట్రంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలు పడుతుండటంతో భారత వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తూత్తుకుడి, తిరునల్వేలి, చెంగల్‌పట్టు, తేన్ కాశీ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రెడ్ అలర్ట్ ప్రకటించి నాలుగు జిల్లాల్లోని స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఇక ఆ జిల్లాల ప్రజలు కూడా వారానికి సరిపడా నిత్యావసరాలను ఇళ్లలో ఉంచుకోవాలని అధికారులు తెలిపారు. తమిళనాడులో ఒక్క గురువారం నాడే 33 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యిందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
మరో వైపు తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. చెన్నై ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. రన్‌వేపైకి భారీగా నీరు చేరడంతో విమానాలను దారి మళ్లీంచినట్లు అధికారులు తెలిపారు. గత కొన్ని రోజుల నుండి దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్ప పీడనాలతో తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో వైపు రేపటి నుండి ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కృష్ణా, అనంతపురం, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.