ఉత్తరకాశీలో వ‌రుస‌గా రెండో రోజు భూప్ర‌కంప‌లు.. భయాందోళనలో ప్ర‌జ‌లు

ఉత్తరకాశీలో మళ్లీ భూమి కంపించింది. శనివారం ఉదయం 5:48 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది.

By Medi Samrat  Published on  25 Jan 2025 8:59 AM IST
ఉత్తరకాశీలో వ‌రుస‌గా రెండో రోజు భూప్ర‌కంప‌లు.. భయాందోళనలో ప్ర‌జ‌లు

ఉత్తరకాశీలో మళ్లీ భూమి కంపించింది. శనివారం ఉదయం 5:48 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప‌ తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 2.4గా న‌మోదైంది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. నిన్న శుక్రవారం కూడా ఉత్తరకాశీలో మూడు సార్లు భూకంపం సంభవించింది. జిల్లా కేంద్రంతోపాటు మనేరి, భట్వాడి, దుండ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం మూడుసార్లు భూప్రకంపనలు సంభవించాయి. భూప్ర‌కంప‌న‌లు మొదట ఉదయం 7:41 గంటలకు, రెండవది 8:19 నిమిషాల‌కు, మూడవది 10:59కి రాగా.. మొదటి రెండు ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై వరుసగా 2.7, 3.5గా ఉంది. మూడో భూకంపం చాలా తేలికగా ఉండటంతో రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత నమోదు కాలేదు.

శుక్రవారం నాటి భూకంపం దాటికి వరుణావత్ పర్వతంపై కొండచరియల నుంచి రాళ్లు పడ్డాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా, విపత్తు నిర్వహణ విభాగం SDRF బృందాన్ని సంఘటనా స్థలానికి పంపింది. అయితే కొండచరియలు విరిగిపడడాన్ని విపత్తు నిర్వహణ శాఖ ఖండించింది.

ఇక్కడ శుక్రవారం ఉదయం ప్రజలు యథావిధిగా తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభించ‌గా.. అదే సమయంలో మొదటి భూకంపం ఉదయం 7.41 గంటలకు సంభవించింది. భూకంప‌ కేంద్రం భూమికి 5 కిలోమీటర్ల దూరంలో తహసిల్ భట్వాడి గ్రామం తిలోత్ అటవీ ప్రాంతంలో ఉంది. అరగంట తర్వాత 8.19 గంటలకు రెండో భూకంపం రాగా.. భూకంప కేంద్రం దయారా బుగ్యాల్ అటవీ ప్రాంతంలో భూమికి 5 కిలోమీటర్ల దిగువన ఉంది. ఈ షాక్‌తో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.

Next Story