కాంగ్రెస్ పార్టీ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఎన్నికల కమిషన్ (ఇసి)కి ఫిర్యాదు చేసింది. కర్ణాటక ఎన్నికల ప్రచార సభల్లో హనుమంతుని పేరుని ప్రధాని ప్రస్తావించడంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. ప్రధాని ర్యాలీల్లో కాంగ్రెస్ పార్టీని విమర్శించడంతో పాటు ఆ పార్టీని హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారని, కాంగ్రెస్‌ను విమర్శించే పేరుతో జై భజరంగ్ బలి అంటూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారని కాంగ్రెస్ అంటోంది. కర్ణాటక ప్రచారసభల్లో ప్రధాని హిందూ దేవతల గురించి ప్రస్తావించడాన్ని అడ్డుకోవాలని, అలాగే మతం పేరుతో ఓట్లు కోరడాన్ని ఆపాలని ఈసీని కోరింది. హిందూత్వ సంస్థ భజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామి ఇవ్వడంపై ప్రధాని స్పందించారు. హనుమంతునికి మరో పేరు అయిన భజరంగ్ బలిని లాక్ అప్ చేయాలని కాంగ్రెస్ కోరుకుంటోందని అన్నారు. మే 2న జరిగిన మూడు ర్యాలీల్లో ప్రధాని జై బజరంగ్ బలి అని నినాదాలు చేశారని కాంగ్రెస్ అంటోంది.