త్వరలోనే నిజం బయటపడుతుంది, మోదీ ప్రజలకు ముఖం చూపలేరు: రాహుల్‌గాంధీ
కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వంపై మళ్లీ విమర్శల దాడి చేశారు.
By Knakam Karthik
త్వరలోనే నిజం బయటపడుతుంది, మోదీ ప్రజలకు ముఖం చూపలేరు: రాహుల్‌గాంధీ
పట్నా: కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వంపై మళ్లీ విమర్శల దాడి చేశారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై త్వరలోనే కాంగ్రెస్ “హైడ్రోజన్ బాంబు”లాంటి బహిర్గతం చేస్తుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. “అటాం బాంబ్ కంటే పెద్దది హైడ్రోజన్ బాంబ్. చాలా త్వరలో నిజం బయటపడుతుంది. ఆ తర్వాత మోదీ దేశ ప్రజల ముందు ముఖం చూపలేరు” అని రాహుల్ హెచ్చరించారు. “నేను ‘వోటు చోర్, గద్దీ చోడ్’ అన్న నినాదం ఇచ్చాను. అది ఇక్కడ నుంచి అమెరికా, చైనా వరకు మార్మోగుతోంది” అని తెలిపారు. బిహార్‌లో 1,300 కిలోమీటర్ల మేర సాగిన ‘వోటర్ అధికార్ యాత్ర’కు ముగింపు పలుకుతూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. 25 జిల్లాల్లోని 110 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఈ యాత్ర సాగింది.
ఇక బీజేపీ రాహుల్ వ్యాఖ్యలను ఖండించింది. బీజేపీ ఎంపీ రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, “అతను చెప్పిన అటాం బాంబ్ డడ్‌గా మారింది. ఇప్పుడు హైడ్రోజన్ బాంబ్ అంటున్నాడు. ఎన్నికలతో దీనికి సంబంధం ఏమిటి?” అని ప్రశ్నించారు. ఓటర్ లిస్టుల్లో 21 లక్షల మృతుల పేర్లు బయటపడ్డాయి. అవి అలాగే కొనసాగాలా? రాహుల్ ప్రమాణ పత్రం ఎందుకు ఇవ్వట్లేదు? అబద్ధం చెబితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి దూరంగా ఉన్నాడు” అని ప్రసాద్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఇటీవల ఓటు చోరీ ఆరోపణలను మరింత ఉధృతం చేశారు. నిజమైన ఓటర్ల పేర్లు తొలగించి, నకిలీ పేర్లు చేర్చడం ద్వారా ఎన్నికలను బీజేపీ తారుమారు చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు.