ఈరోజు కాదు.. ఏడు రోజుల తర్వాత.. ఈసీని స‌మ‌యం కోరిన‌ కాంగ్రెస్-బీజేపీ

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.

By Medi Samrat  Published on  18 Nov 2024 2:55 PM IST
ఈరోజు కాదు.. ఏడు రోజుల తర్వాత.. ఈసీని స‌మ‌యం కోరిన‌ కాంగ్రెస్-బీజేపీ

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. తమ నేతలపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం శనివారం ఇరు పార్టీల అధ్యక్షులను కోరింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేలకు ఎన్నికల సంఘం వేర్వేరుగా లేఖలు రాసి.. ఫిర్యాదుల‌పై వివరణ ఇవ్వాలని కోరింది.

సోమవారం (నవంబర్ 18) మధ్యాహ్నం 1 గంటలోపు ఎన్నికల సంఘం రెండు పార్టీల అధ్యక్షుల నుంచి అధికారికంగా సమాధానాలు కోరింది. అయితే.. రెండు పార్టీలు తమ తమ సమాధానాలను పంపడానికి ఎన్నికల సంఘాన్ని రోజులు స‌మ‌యం కోరాయి.

ఇదిలావుంటే.. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని కాంగ్రెస్ ఆరోపించగా.. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై బీజేపీ ఫిర్యాదు చేసింది.

లోక్‌సభ ఎన్నికల సమయంలో స్టార్ క్యాంపెయినర్లు, నాయకులను అదుపులో ఉంచుకోవాలని, తద్వారా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను అక్షరబద్ధంగా పాటించాలని గతంలో కమిషన్ ఇచ్చిన సలహాను ఎన్నికల సంఘం గుర్తు చేసింది. జార్ఖండ్, మహారాష్ట్రలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇరు పార్టీల అగ్రనేతలు ప్రచారం చేస్తున్నారు. జార్ఖండ్‌లో ఒక దశ ఎన్నికలు పూర్తయ్యాయి. మహారాష్ట్రలోని అన్ని స్థానాలకు.. జార్ఖండ్‌లోని మిగిలిన స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి.

Next Story