Video : అమిత్ షా ఎదుట కన్నీటి పర్యంతమైన మృతుల కుటుంబ సభ్యులు
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ లో క్రూరమైన ఉగ్రవాద దాడికి పాల్పడిన నిందితులను న్యాయస్థానం ముందుకు తీసుకువస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం ప్రతిజ్ఞ చేశారు.
By Medi Samrat
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ లో క్రూరమైన ఉగ్రవాద దాడికి పాల్పడిన నిందితులను న్యాయస్థానం ముందుకు తీసుకువస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం ప్రతిజ్ఞ చేశారు. భారత్ ఎప్పుడూ భయంకరమైన ఉగ్రవాద చర్యలకు లొంగిపోదని అన్నారు. పహల్గామ్‌లోని బైసరన్ లోయలో ఈ దాడి జరిగింది. ఉగ్రవాదులు అడవి నుంచి వచ్చి.. నిరాయుధులైన పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి పర్యాటకుల ప్రాణాలు తీశారు.
మృతుల కుటుంబాలను, బాధితులను పరామర్శించేందుకు శ్రీనగర్‌కు వెళ్లిన షా విచారం వ్యక్తం చేస్తూ.. దారుణమైన హత్యాకాండకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారికి బరువెక్కిన హృదయంతో చివరి నివాళులు అర్పిస్తున్నట్లు షా X లో ఒక పోస్ట్‌లో రాశారు. ఉగ్రవాదానికి భారత్ తల వంచదు అన్నారు.
పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన బాధ ప్రతి భారతీయుడికి ఉందని హోంమంత్రి తన పోస్ట్‌లో రాశారు. ఈ బాధను మాటల్లో చెప్పలేం. అమాయక ప్రజలను చంపే ఈ ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని నా కుటుంబాలకు, దేశం మొత్తానికి నేను హామీ ఇస్తున్నాను.
అంతకుముందు, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కలిసి కేంద్ర మంత్రి షా శ్రీనగర్‌లోని పోలీసు కంట్రోల్ రూమ్‌లో మృతులకు నివాళులర్పించారు, అక్కడ మృతదేహాలను కట్టుదిట్టమైన భద్రత మధ్య తీసుకువచ్చారు. కాగా, బాధితులను స్వస్థలాలకు తరలించేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం శ్రీనగర్ నుండి నాలుగు అదనపు విమానాలను ఏర్పాటు చేసింది. ఇందులో ఢిల్లీ, ముంబైకి రెండు విమానాలు ఉన్నాయి.
శ్రీనగర్-జమ్మూ హైవే వరుసగా నాల్గవ రోజు మూసివేయబడినందున ప్రయాణికుల రద్దీ ఉన్నప్పటికీ విమాన ఛార్జీలు నియంత్రణలో ఉండాలని అధికారులు ఆదేశించారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బృందం శ్రీనగర్‌కు చేరుకుని ఉగ్రవాదుల దాడికి సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు పహల్గామ్‌కు బయలుదేరింది. ఈ క్రూరమైన దాడికి పాల్పడిన ఉగ్రవాదుల జాడ కోసం బైసరన్ లోయ, చుట్టుపక్కల పెద్ద సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది.
ఈ దాడిపై సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ దాడి ఉగ్రవాదాన్ని నిర్మూలించాలన్న భారత్ సంకల్పాన్ని మరింత బలోపేతం చేసిందని అన్నారు. ఇలాంటి పిరికిపంద చర్యలు భారత్‌ను ఆపలేవని ప్రధాని అన్నారు. ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు గతంలో కంటే ఎక్కువ సంకల్పంతో ఉన్నామన్నారు.