జమ్ముకశ్మీర్‌లో శనివారం తెల్లవారుజామున భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.0 గా నమోదయ్యింది. భూప్రకంపనల ధాటికి ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు లేవని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. దోడా ప్రాంతంలో తెల్లవారుజామున 2.53 గంటలకు భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. అక్షాంశాలు 36.06 డిగ్రీల ఉత్తరాన.. రేఖాంశం 75.82 డిగ్రీల తూర్పున ఉన్నాయని విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు.
భూకంప కేంద్రం దోడా ప్రాంతంలో కనుగొన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉందని విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు. సిస్మాలజీ ప్రకారం.. కశ్మీర్ భూకంపాలు సంభవించే ప్రాంతంలో ఉంది. గతంలో అక్కడ సంభవించిన ప్రకంపనలు విధ్వంసం సృష్టించాయి. అక్టోబర్ 8, 2005న నమోదైన భూకంపం కారణంగా నియంత్రణ రేఖకు రెండు వైపులా 80,000 మందికి పైగా మరణించారు. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది.