చేతబడి నెపంతో చిన్నారి సహా నలుగురి దారుణ హత్య
ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని దారుణంగా హత్య చేసిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో వెలుగు చూసింది
By Medi Samrat Published on 13 Sept 2024 12:28 PM ISTఒకే కుటుంబానికి చెందిన నలుగురిని దారుణంగా హత్య చేసిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో వెలుగు చూసింది. పక్కింటి వ్యక్తి చేతబడి అనుమానంతో.. పొరుగున ఉన్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురిపై గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటన గురువారం సాయంత్రం జరిగింది. మృతుల్లో ఇద్దరు మహిళలు, పురుషుడు, ఓ చిన్నారి ఉన్నారు. ఈ ఘటన బలోదాబజార్ జిల్లా కస్డోల్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లో చోటుచేసుకుంది.
సమాచారం ప్రకారం.. నిందితులు 45 ఏళ్ల ఛేత్రమ్ కేవత్, యశోదా బాయి, జమున మరియు ఆమె 11 నెలల చిన్నారిని గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటనపై కస్డోల్ పోలీసులు ముగ్గురు నిందితులు రామ్‌నాథ్ పాట్లే, అతని కుమారుడు దీపక్, దిల్ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. నిందితులు వారి పొరుగున ఉంటారు.
రామ్‌నాథ్ పాట్లే కుమార్తె గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. అందుకు కేవత్ కుటుంబం కొన్ని మంత్రవిద్యలు ఆమెపై చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో నిందితులు గొడ్డలితో దారుణ హత్యకు పాల్పడ్డారు. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. సమీపంలోని వ్యక్తులను కూడా విచారిస్తున్నారు.
హత్యాకాండ తరువాత పరిస్థితిని అదుపులో ఉంచడానికి గ్రామంలో పోలీసు బలగాలను మోహరించారు. పోలీసు సూపరింటెండెంట్ విజయ్ అగర్వాల్ కూడా పోలీసు బృందంతో వచ్చారు. ఈ కేసులో ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే ఘటనాస్థలానికి బలోదాబజార్ నుంచి ఫోరెన్సిక్ బృందం బయలుదేరింది. అనంతరం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ విషయమై ఎస్పీ విజయ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. వారు ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిపారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.