కశ్మీర్ లో గత వారం ఖాన్‌మోహ్ సర్పంచ్ (గ్రామాధికారి) సమీర్ భట్‌ను హతమార్చిన ముగ్గురు లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాదులు బుధవారం శ్రీనగర్‌లోని నౌగామ్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారని కశ్మీర్ ఐజిపి విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఉగ్రవాదులు మార్చి 9న సర్పంచ్‌ను కాల్చి చంపారు.
ముగ్గురు ఉగ్రవాదులు శ్రీనగర్ శివార్లలోని నౌగామ్ ప్రాంతంలోని రైలు మార్గానికి సమీపంలో ఉన్న ఒక ఇంట్లో దాక్కున్నారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా దళాలపై వారు కాల్పులు జరపడంతో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. నౌగామ్ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం ఆధారంగా భద్రతా దళాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
ఆర్మీ, CRPF, J&K పోలీసులతో సహా భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారిందని పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుండి ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో సహా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. రాళ్లదాడికి పాల్పడి ఆపరేషన్‌కు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నించిన దుండగుల బృందాన్ని పోలీసులు తరిమికొట్టారు. ఎదురుకాల్పుల్లో ఉగ్రవాదులు దాక్కున్న ఇల్లు ధ్వంసమైంది.