ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరోసారి భూకంపం సంభవించింది. ఉత్తరకాశీలో 20 నిమిషాల వ్యవధిలో వరుసగా మూడు సార్లు భూమి కంపించింది. శనివారం, ఆదివారం మధ్య రాత్రి ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో రిక్టర్ స్కేలుపై 2.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూమి లోపల 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది. అర్ధరాత్రి 12:40 గంటల ప్రాంతంలో మొదటి సారి భూమి కంపించింది. ఆ తర్వాత మరో ఐదు నిమిషాల వ్యవధిలోనే మరోసారి కంపించింది. అనంతరం అర్ధరాత్రి ఒంటిగంటకు మూడోసారి భూప్రకంపనలు వచ్చాయి. వరుస ప్రకంపనలతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు.
భూకంపం సంభవించడంతో స్థానిక ప్రజల్లో భయానక వాతావరణం నెలకొంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఇంకా ఎటువంటి రిపోర్ట్స్ లేవు. ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లాలో గురువారం 2.4 తీవ్రతతో భూకంపం సంభవించిన కొద్ది రోజుల తర్వాత ఇది జరిగింది. అంతకుముందు డిసెంబర్‌లో కూడా, 2022 డిసెంబర్‌లో ఉత్తరకాశీలో 3.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. హిమాచల్, ఉత్తరాఖండ్‌తో సహా నేపాల్‌లోని పశ్చిమ భాగానికి మధ్య భూకంప అంతరం అని పిలువబడే ఈ ప్రాంతం ఎప్పుడైనా భూకంపాలకు గురయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్త ఒకరు తెలిపారు.