జమ్ముకాశ్మీర్‌లో భూమి కంపించింది. శుక్రవారం తెల్లవారుజామున 5.10 గంటల సమయంలో కత్రాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది.
కత్రాకు తూర్పున 97 కిలో మీటర్ల దూరంలో ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో భూ కంప కేంద్రాన్ని గుర్తించారు. ఇప్పటి వరకు ఈ భూ ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 13 న, సిక్కిం రాష్ట్రంలో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం సిక్కింలోని యుక్సోమ్‌లో తెల్లవారుజామున 4.15 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.3గా నమోదైంది.