వరుస భూకంపాలు ప్రజలను భయపెడుతున్నాయి. నిన్న భారత్, నేపాల్‌లో భూమి కంపించగా తాజాగా నేడు తూర్పు తజికిస్థాన్‌లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.8గా నమోదు అయినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) తెలిపింది.
స్థానిక కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 5:37 గంటలకు భూ ఉపరితలం నుంచి 20.5కి.మీ లోతులో భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్తాన్ -చైనా సరిహద్దులో ఉన్న సెమీ అటానమస్ తూర్పు ప్రాంతమైన గోర్నో-బదక్షన్ ప్రాంతానికి సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
ఈ ప్రాంతం ఎక్కువగా పర్వత ప్రాంతం కావడంతో జనాభా చాలా తక్కువ సంఖ్యలో నివసిస్తుంటారు. దీంతో పెద్దగా నష్టం వాటిల్లినట్లు సమాచారం ఇప్పటి వరకు అందలేదని అధికారులు చెబుతున్నారు.
కాగా.. ఈ భూకంపం సంభవించిన ఇరవై నిమిషాల తరువాత మరోసారి అక్కడ భూమి కంపించింది.రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.0గా నమోదైంది.