తమిళనాడులో బీజేపీకి షాక్..!
13 BJP workers quit party in Tamil Nadu. తమిళనాడు రాష్ట్రంలో బీజేపీకి షాక్ తగిలింది.
By M.S.R Published on 8 March 2023 2:00 PM GMTBJP workers quit party in Tamil Nadu
తమిళనాడు రాష్ట్రంలో బీజేపీకి షాక్ తగిలింది. తమిళనాడు బీజేపీకి చెందిన మొత్తం 13 మంది కార్యకర్తలు బుధవారం పార్టీని వీడి, ఆ కూటమిలో భాగస్వామి అయిన ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK)లో చేరారు. 13 మంది చెన్నై వెస్ట్‌లోని బీజేపీ ఐటీ విభాగానికి చెందినవారు. ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే తమ నేతలను లాక్కోడానికి ప్రయత్నిస్తూ ఉందని బీజేపీ రాష్ట్ర విభాగం ఆరోపిస్తున్న సమయంలోనే ఈ జంపింగ్ కార్యక్రమం చోటు చేసుకుంది.
బీజేపీని వీడిన 13 మంది నేతలు పశ్చిమ చెన్నైలోని ఐటీ విభాగానికి చెందినవారు. తాను బీజేపీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నానని, ఎలాంటి పదవులను ఆశించలేదని, అయితే పార్టీలో గత కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తనను పార్టీని వీడేలా చేశాయని బీజేపీ ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు అంబరాజన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంబరాజన్‌తో పాటు బీజేపీని వీడిన వారిలో 10 మంది ఐటీ వింగ్ జిల్లా కార్యదర్శులు, ఇద్దరు ఐటీ వింగ్ డిప్యూటీ కార్యదర్శులు ఉన్నారు. ఇప్పటికే బీజేపీ ఇంటెలెక్చువల్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణన్, ఐటీ వింగ్ రాష్ట్ర కార్యదర్శి దిలీప్ కన్నన్, తిరుచ్చి రూరల్ జిల్లా ఉపాధ్యక్షుడు విజయ్, రాష్ట్ర ఓబీసీ వింగ్ కార్యదర్శి అమ్ము అన్నాడీఎంకేలో చేరిపోయారు. ఎడప్పాడి పళనిస్వామి కూటమిలో భాగస్వామిగా ఉండి కూడా వారిని చిరునవ్వుతో ఎలా స్వాగతిస్తారంటూ బీజేపీ కార్యకర్తలు ప్రశ్నలు సంధించారు.