బీజేపీ నేతలకు కేటీఆర్ సవాల్.. ప్రధాని మోదీ మీద ఊహించని సెటైర్లు
KTR Challenge to BJP leaders. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో మహిళ దినోత్సవ వేడుకలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.
By Medi Samrat Published on 8 March 2023 7:11 PM ISTMinister KTR
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో మహిళ దినోత్సవ వేడుకలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. కేంద్రం ఏ అవార్డులు ప్రకటించినా ఎర్రబెల్లి నాయకత్వం వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖకు వస్తూ ఉండడం గర్వకారణమన్నారు. మంత్రి కృషి, అధికారులు పనితీరు వల్లే ఇలాంటి గుర్తింపు లభించిందని అభినందించారు. మేము ఏమి చేశామో ప్రతి గ్రామంలో రెండు గంటలు చెప్పే దమ్ము మాకుంది, మాతోపాటు అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతలకు ఆ దమ్ముందా అని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రధాని, ఆయన పార్టీకి, నేతలకు సత్తా ఉండాలి కదా? తెలంగాణ ఆడబిడ్డలకు ఏం చేశారు? తెలంగాణ గిరిజనులకు ఏం చేశారు? తెలంగాణ రైతులకు ఏం చేశారు? తెలంగాణలోని ఏ వర్గానికి ఏం చేశారో చెప్పే సత్తా వారికి ఉన్నదా? వరంగల్‌కు వచ్చిన సమయంలో ప్రధాని అందరు జన్‌ధన్ ఖాతాలు తెరిస్తే ధనాధన్ రూ.15లక్షలు వేస్తామని చెప్పారని, మరి అందరికి రూ.15లక్షలు వచ్చాయా? అని ప్రశ్నించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఎకరాకు కనీసం రెండు రూపాయల లాభం కూడా లేదని ఆరోపించారు. బీజేపీ దొంగసొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుడు ప్రభుత్వాలను కూల్చుడే మోదీ పాలన అని అన్నారు. కేవలం మతపరమైన పంచాయతీ పెట్టి ఓట్లు దండుకోవడం తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. మోదీ ప్రియమైన ప్రధాని కాదు.. పిరమైన( ఖరీదైన) ప్రధాని అంటూ సెటైర్లు వేశారు. ఏం చేశావయ్యా మోదీ ఎనిమిదేళ్లలో అంటే.. చెప్పేందుకు ఏం లేదు. ఆకాశంలో అప్పులున్నయ్. మోదీ వచ్చినప్పుడు గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉండే, ఇవాళ రూ.1200కు చేరింది. ఆయన దేశంలో ఉన్నవారంతా పిచ్చొళ్లు అనుకుంటున్నాడని మంత్రి కేటీఆర్ విమర్శించారు.