Hyderabad: డీఫిబ్రిలేటర్ల ఏర్పాటును పరిశీలిస్తాం: కేటీఆర్‌

హైదరాబాద్‌ మహానగరంలో డీఫిబ్రిలేటర్ల ఏర్పాటును పరిశీలిస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు

By అంజి  Published on  2 March 2023 2:10 PM IST
Minister KTR, Hyderabad, defibrillators

మంత్రి కేటీఆర్‌ (ఫైల్‌ ఫొటో)

హైదరాబాద్‌: మహా నగరంలో లక్ష మందికి సీపీఆర్‌ ట్రైనింగ్‌ ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖను మంత్రి కేటీఆర్‌ కోరారు. అలాగే జిల్లాల్లో వందల మందికి సీపీఆర్‌ ట్రైనింగ్‌ ఇవ్వాలన్నారు. నిన్న మేడ్చల్‌ జిల్లాలో సీపీఆర్‌ శిక్షణను ప్రారంభించిన అనంతరం కేటీఆర్‌ ప్రసంగించారు. జనసంచారం ఉన్న ప్రాంతాల్లో పబ్లిక్‌ యాక్సెస్‌ డీఫిబ్రిలేటర్‌లను ఇన్‌స్టాల్‌ చేయాలని మంత్రి హరీశ్‌రావును కోరారు. ట్విట్టర్‌లో ప్రముఖ డాక్టర్‌ ముఖర్జీ.. డీఫిబ్రిలేటర్‌ల గురించి తనకు వివరించారని, దీని వల్ల చాలా ప్రయోజనం ఉంటుందని తెలిపారు. మాల్స్‌, సూపర్‌ మార్కెట్లు, బస్టాండ్లు, ఆఫీసు ప్రాంగణాల్లో డీఫిబ్రిలేటర్‌లను ఇన్‌స్టాల్‌ చేసి, ట్రైనింగ్‌ తీసుకున్న వారిని అక్కడ నియమించాలని హరీశ్‌ రావును కోరారు.

వీలైనంత తొందరగా డీఫిబ్రిలేటర్ల ఏర్పాటును పరిశీలించాలన్నారు. డీఫిబ్రిలేటర్‌లను ఇన్‌స్టాల్‌ చేసేందుకు జీహెచ్‌ఎంసీ, తమ శాఖ సహకరిస్తుందని, ఇతర శాఖలు కూడా ముందుకు వస్తాయని తెలిపారు. ఐటీ పార్కుల్లో, ఇండస్ట్రీయల్‌ క్లస్టర్‌లో, మాల్స్‌లో వీటిని తప్పనిసరిగా ఇన్‌స్టాల్‌ చేద్దామని అన్నారు. డీఫిబ్రిలేటర్‌ల ఇన్‌స్టాల్‌తో పాటు అక్కడుండే వారికి తప్పనిసరిగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఇలా చేయడం ద్వారా కొన్ని ప్రాణాలనైనా కాపాడినవారము అవుతామని అన్నారు. సీపీఆర్ శిక్ష‌ణ పొందిన వారు ఉంటే కార్డియక్‌ అరెస్ట్‌కు గురైన వారిని వెంటనే రక్షించవచ్చున్నారు. లైఫ్ స్టైల్ ఛేంజెస్ వ‌ల్ల ఈ రోగాలు చుట్టుముడుతున్నాయని అన్నారు.

సీపీఆర్‌ను నేర్పించ‌గ‌లిగితే చాలా వ‌ర‌కు స‌డెన్ కార్డియాక్ అరెస్టును త‌గ్గించొచ్చన్నారు. ర‌క్త ప్ర‌స‌ర‌ణ ఆగిపోకుండా ప్రాథ‌మికంగా ఆ వ్య‌క్తిని కాపాడుకోవ‌చ్చు అని కేటీఆర్ సూచించారు. సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ఆధ్వ‌ర్యంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ‌ బ్ర‌హ్మాండంగా ముందుకు పోతోంద‌ని కేటీఆర్ ప్ర‌శంసించారు. ఆరోగ్య తెలంగాణ సాధ‌న‌లో భాగంగా ఒక వైపు అన్ని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో వైద్య స‌దుపాయాల‌ను క‌ల్పిస్తున్నామ‌ని చెప్పారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో న‌లువైపులా నాలుగు సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రులు, వ‌రంగ‌ల్‌లో 2 వేల ప‌డ‌క‌ల ఆస్ప‌త్రి నిర్మిస్తున్నామని తెలిపారు.

Next Story