మార్చి31.. ఆ డెడ్‌లైన్ వెనుక మర్మమేంటి.?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 March 2020 6:46 PM ISTకరోనా వైరస్(కొవిడ్-19) ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తోంది. చైనాలో తొలిసారిగా రెండున్నర నెలలక్రితం వెలుగు చూసింది. అక్కడినుండి ప్రపంచ దేశాలకు విస్తరించి.. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకూ 8000మందికి పైగా మృత్యువాత పడ్డారు. రెండు లక్షలకుపైగా బాధితులూ ఉన్నారు.
ఇదిలా ఉంటే మనదేశంలో కూడా దీని బాధితులు రోజురోజుకు పెరుగుతున్నారు. ఈ మహమ్మారి వల్ల మనదేశంలో ఇప్పటికే ముగ్గురు మరణించగా.. 127మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. తాజా సమాచారం ప్రకారం 250మందికి పైగా వివిధ దేశాలలో నివసిస్తున్న భారతీయులు ఈ వైరస్ బారినపడ్డారని తెలుస్తుంది.
అయితే.. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇప్పటికే అన్ని దేశాలు చర్యలు చేపట్టాయి. చాలా దేశాలు విమాన ప్రయాణాలు నిషేదించాయి. ఇటలీ.. తమ దేశంలోని మొత్తం ఆరు కోట్ల జనాభాను లాక్‌డౌన్ చేసింది. దేశంలో ఆహారం, ఫార్మసీ మినహా అన్నిరకాల దుకాణాలు మూసివేశారు. ఒక చోట జనం గుమిగూడడాన్ని నిషేధించారు. ప్రజలందరూ తమ తమ ఇళ్లలోనే ఉండాలని సూచించారు. అగ్రరాజ్య అధినేత డోనాల్డ్ ట్రంప్ కూడా.. తమ దేశ ప్రజలందరిని ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. రానున్న 15 రోజులు చాలా కీలకమని.. అందరూ కూడా ఇళ్లలోనే ఉండాలన్నారు.
ఇక, మనదేశంలో కూడా కళాశాలలు, పాఠశాలలను మార్చి 31 వరకు మూసివేశారు. జన సంచారం ఎక్కువగా ఉండే పర్యాటక ప్రదేశాలు, పార్కులు, సినిమా థియేటర్లను ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో మూసివేశారు. ప్రస్తుతం కరోనా రెండో దశలో ఉందని.. కరోనా వ్యాప్తిని నియంత్రించడానికే ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఇదిలావుంటే.. అసలు ఈ వైరస్ ఎంతకాలం జీవిస్తుంది అన్నది మాత్రం ఖచ్చితంగా తెలియదు. గాలిలో ఎంతసేపు జీవిస్తుంది. ఎండపెరిగితే.. వైరస్ వ్యాప్తి తగ్గుతుందని అంటున్నారు. ఖచ్చితంగా ఎండపెరిగితే వైరస్ కనుమరుగు అవుతుంది అంటే పరిస్థితులు కొంత మేరకు అదుపులోకి వచ్చే అవకాశాలున్నాయి. కానీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. అందరూ చెబుతున్న మాట ఒకటే.. రానున్న 15 రోజులు కీలకం అని.
అసలు ఈ 15 రోజుల్లో ఏం జరగనుంది. కరోనా మహమ్మారి రెండో దశలో ఉందని అందరూ చెబుతున్నారు. కరోనాను చూసి భయపడవద్దనీ అంటున్నారు. ఇప్పటి వరకు దీనికి మందును కనిపెట్టలేదు. కానీ ప్రభుత్వాలు చెబుతున్నట్లు కరోనా వైరస్ ప్రమాదకరం కాదా..? మరి కాకుంటే.. ఎందుకు ఇంతలా ఆంక్షలు విధిస్తున్నారు.? మార్చి 31 వరకు అత్యంత కీలకం అంటున్నారు. మార్చి 31 ఆ గడువు వెనుక ఉన్న ఆంతర్యమేంటి? లాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇక కరోనా వైరస్.. మాంసం తినడం ద్వారానే వచ్చిందా..? లేక దేశాల ఆధిపత్య పోరుకై సంబంధించి తయారు చేసిన బయో కెమికలా.? ఏది నిజం..? ప్రస్తుతానికి ఈ ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు. ఒకవేళ ఇది బయో వైరస్ అయితే.. దీని గురించి ఆయా ఆయా దేశాలనికి పూర్తిగా తెలిసుండాలి. మార్చి 31 తర్వాత కరోనా వైరస్ కనుమరుగు కానుందా..? తరువాత పరిణామాలు ఏమిటీ అనే దానిపై ఇప్పటికే ఓ స్పష్టత ఉండుండాలి. కానీ అటువంటిదేమి లేనట్లుగా కనిపిస్తొంది. ఏదేమయినా ఈ ప్రశ్నలంటికి కాలమే సమాధానం చెప్పాలి.
అయితే.. ప్రస్తుతం కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. వారి లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి కరోనావైరస్ కేసుల్లో.. తొమ్మిది మంది(ఒకరిద్దరు అటు ఇటు) అంటే దాదాపు ఒక శాతం మంది బాధితులు చనిపోయే ప్రమాదం ఉంటుందని సమాచారం. ఇదిలావుంటే.. కరోనా వ్యాప్తికి చైనానే కారణం అని అమెరికా అంటుండగా.. లేదు అమెరికానే దీనికి కారణం అని చైనా అంటోంది. అదిగో పులి అంటే.. ఇదిగో తోక అన్న చందంగా.. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. వైరస్ ఎక్కడపుట్టినా ప్రస్తుతం ప్రపంచమంతా వ్యాపించింది కాబట్టి.. ఆ మహమ్మారి బారిన పడకుండా ప్రభుత్వాలు చెబుతున్నట్టు ముందు జాగ్రత్త చర్యలు పాటించడమే మనం చేయగల పని.