విపత్తు వేళ జగన్ ముందుచూపు.. మ‌రి తెలంగాణ‌లో అలా చేస్తారా.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 July 2020 2:14 PM IST
విపత్తు వేళ జగన్ ముందుచూపు.. మ‌రి తెలంగాణ‌లో అలా చేస్తారా.?

కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే విషయంలో ప్రదర్శించే స్థైర్యం.. తెలివి సదరు వ్యక్తి సామర్థ్యం ఎంతన్న విషయంపై అవగాహన వచ్చేలా చేస్తుంది. వందేళ్లకు ఒకసారి కూడా వస్తుందో రాదో సరిగా చెప్పలేని ‘కరోనా’ లాంటి పరిస్థితిని ఎదుర్కోవటం అంత తేలికైన విషయం కాదు. ఇప్పటివరకు విపత్తు అంటే.. వారం.. పది రోజులు కాదంటే నెల రోజులు. అంతకు మించిన నెలల తరబడి ఉండే పరిస్థితిని ఇప్పుడున్న ఏ ప్రభుత్వం ఎదుర్కొన్నది లేదు. మామూలుగా అయితే.. ఏ విపత్తు విరుచుకుపడినా రాష్ట్రంలోని ఒక ప్రాంతమో.. రెండు ప్రాంతాలే కానీ యావత్ రాష్ట్రం ఒకేలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు.

ఆ మాటకు వస్తే.. రాష్ట్రమే కాదు. యావత్ దేశంలోనూ.. ప్రపంచంలోనూ ఇప్పుడున్న పరిస్థితిని ఎప్పుడు ఎదుర్కొన్నది లేదు. ఇలాంటి వేళ.. తీసుకునే నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోయేలా చేస్తుంది. కరోనా మహమ్మారి విరుచుకుపడుతుందన్న సంకేతాలు కనిపించిన సమయంలో యమా యాక్టివ్ గా కనిపించిన కేసీఆర్.. తర్వాత మాత్రం ఆ విషయానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వకపోవటం కనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. పొరుగున ఉన్న ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి.

కరోనా విషయంలో మొదట్లోకాస్త తడబడినట్లుగా కనిపించిన ఏపీ సర్కారు.. వెంటనే సర్దుకోవటమే కాదు.. సహాయక చర్యల్లోనూ.. వినూత్న విధానాలు పాటించటంలోనూ ముందు ఉంటోంది. తమ రాష్ట్రానికి వచ్చే ఇతర రాష్ట్రాల వారి విషయంలో మొదట్నించి కఠినంగా వ్యవహరించటమే కాదు.. అనుమానితులు.. పాజిటివ్ లకు సంబంధించి జగన్ సర్కారు అనుసరిస్తున్న విధానాలు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి.

అదే సమయంలో.. తెలంగాణ రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏపీ సర్కారు మాదిరి నిర్ణయాలు ఎందుకు తీసుకోవటం లేదన్న ప్రశ్నలు తరచూ వినిపిస్తున్నాయి. ఇప్పటివరకూ అమలు చేస్తున్న విధానాలకు తోడుగా మరిన్ని నిర్ణయాల్ని జగన్ సర్కారు తాజాగా ప్రకటించింది. కొవిడ్ కేసుల్ని నిరాకరిస్తే.. ఆసుపత్రుల అనుమతులు రద్దు చేసేందుకు సైతం వెనుకాడొద్దని సీఎం జగన్ ప్రకటించారు. అంతేకాదు.. కోవిడ్ కారణంగా మరణించిన కుటుంబసభ్యులకు రూ.15వేలు ఇవ్వాలని ఆదేశించారు.

అంతేకాదు.. రానున్న రోజుల్లో కరోనా కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉండటంతో.. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లు వైద్య సిబ్బందిని సన్నద్ధం చేయాలని కోరారు. కనీసం 17వేల మంది వైద్యులు.. 12వేల మంది నర్సుల సేవలు అవసరమవుతాయన్న అంచనాతో పాటు.. అందుకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటి నుంచే షురూ చేయాలని ఆదేశించారు.

ఇదంతా చూస్తున్నప్పుడు.. తెలంగాణలోనూ ఇలాంటి నిర్ణయాల్ని వేగంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కరోనా వైద్యానికి సంబంధించి.. ప్రభుత్వం అమలుచేస్తున్న కంటైన్మెంట్ జోన్లు.. చేస్తున్న నిర్దారణ పరీక్షల మీదే ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఇలాంటివేళ.. జగన్ ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఫ్యూచర్ ఫ్లాన్లను సిద్ధం చేసుకోకపోతే మాత్రం మరిన్ని తిప్పలు తప్పవని చెప్పక తప్పదు. మరి.. జగన్ సర్కారును కేసీఆర్ ఫాలో అయ్యేందుకు ఇష్టపడతారంటారా?

Next Story