జగన్ అండ్ కో మాట తప్పి.. మడమ తిప్పేశారా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Aug 2020 6:28 AM GMT
జగన్ అండ్ కో మాట తప్పి.. మడమ తిప్పేశారా?

అధికారం చేతిలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు ఎవరూ ప్రశ్నించలేనివి. అందుకే ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వానికి మించిన పవర్ ఫుల్ వ్యవస్థ మరొకటి ఉండదు. అధికారం ప్రజలే కట్టబెట్టినా.. తనకు లభించిన అవకాశాన్ని ఒక్కో ముఖ్యమంత్రి ఒక్కోలా వినియోగించుకుంటారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే.. ఏపీ రాజధానిగా అమరావతిని ఫిక్స్ చేయగా.. దాని స్థానంలో మూడు రాజధానుల మాటను తెర మీదకు తేవటమే కాదు.. అమల్లోకి తెచ్చే వరకు తీసుకొచ్చారు. గవర్నర్ ఆమోదముద్ర నేపథ్యంలో మూడు రాజధానులపై సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం వాస్తవ రూపం దాల్చనుంది.

ఈ సందర్భంగా అమరావతి కోసం భూములు ఇచ్చిన వారంతా వేదన చెందుతున్నారు. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు.. ఎన్నికల సమయంలోనే కాదు.. తర్వాతి రోజుల్లో రాజధాని అమరావతి విషయం మీద తమకిచ్చిన మాటేమిటి? ఇప్పుడు చేస్తున్నదేమిటి? అని ప్రశ్నిస్తున్నారు. మాట తప్పను.. మడమ తిప్పనంటూ నాటి వైఎస్ మాటల్ని గుర్తుకు తెస్తూ జగన్ అండ్ కో చేసే వ్యాఖ్యలకు వాస్తవానికి పొంతన లేకపోవటాన్ని గుర్తుకు తెస్తున్నారు.

అమరావతే ఏపీ రాజధానిగా ఉంటుందంటూ జగన్మోహన్ రెడ్డితో పాటు.. ఆ పార్టీకి చెందిన నేతలు పలువురు మీడియా సాక్షిగా చెప్పిన వైనాన్ని గుర్తుకు తెస్తూ నిలదీస్తున్నారు. దీనికి సంబంధించి.. తేదీలతో సహా వారు ప్రస్తావిస్తున్నారు. మాట ఇస్తే దాని మీద నిలబడతానని చెప్పే జగన్.. అమరావతి మీద చెప్పిన మాటను.. ఇచ్చిన హామీని ఎలా వదిలేస్తారన్న ప్రశ్నకు సమాధానం రాని పరిస్థితి. అమరావతే రాజధాని అంటూ జగన్అండ్ కో వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల్లో ముఖ్యమైనవి చూస్తే..

అమరావతి ఎంపికపై ప్రతిపక్ష నేతగా 2014లో రాష్ట్ర శాసనసభలో జరిగిన చర్చలో జగన్ చేసిన ప్రసంగంలో..

‘విజయవాడలో రాజధానిని పెట్టడాన్ని మనస్ఫూర్తిగా మేం ఆహ్వానిస్తున్నాం. ఎస్‌... ఎస్‌... దీనికి కారణం ఏమిటంటే మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో ఒక ప్రాంతానికి, మరో ప్రాంతానికి మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక ఈ నిర్ణయానికి మద్దతు ఇస్తున్నాం. మీరు రాజధాని నగరాన్ని ఎక్కడయినా పెట్టండి. కానీ ఎక్కడ పెట్టినా 30 వేల ఎకరాల భూమి ఉన్నచోట పెట్టండి’

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణ వివిధ సందర్భాల్లో చెప్పిన మాటలు..

‘‘రాష్ట్రానికి రాజధాని కావాలి. దానికి మేం వ్యతిరేకం కాదు. ఎక్కడ శంకుస్థాపన జరుగుతుందో అదే రాజధాని. జగన్‌ వస్తే రాజధానిని మారుస్తారని కొందరు అంటున్నారు. ఎందుకు మారుస్తారు?’’

‘‘విభజన చట్టం ప్రకారం కొత్త ప్రభుత్వం వచ్చి విజయవాడ - గుంటూరు మధ్య కొత్త రాజధానిని పెడుతున్నామని చెప్పగానే జగన్‌ లేచి నిలబడి దానిని సమర్థించారు. అంతకంటే ఏం కావాలి?’’

‘‘భూ కబ్జాలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవారు రాజధాని మార్పు కోరతారు. మేం కాదు. రాజధాని అమరావతిలోనే ఉంటుంది. ఉండాలి. కావాలని పదిసార్లు మాపై నిందలు వేస్తున్నారు’’

మంగళగిరిలో లోకేశ్ పై పోటీ చేసి గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి

‘‘నేను మాట ఇస్తున్నా. జగన్‌ అన్నతో నేను మాట్లాడతా.. ఇదే రాజధాని. అమరావతే రాజధాని. జగన్‌ ఇప్పటికే చెప్పారు. టీడీపీ చెప్పే మోసపూరిత మాటలకు మోసపోవద్దు’’

ఎన్నికల వేళ జగన్ కు అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి

‘‘రాజధాని నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు. ఒక రోడ్డు వేస్తుంటారు. ఆ రోడ్డు నిర్మాణంలో అవినీతి జరిగితే దానిపై విచారణ చేస్తాం. అంతేగాని ఆ రోడ్డుపై నడవకూడదని ఎందుకు అనుకుంటాం’’

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా ఎన్నికల ప్రచార సమయంలో ఉమ్మారెడ్డి

‘‘ఎట్టి పరిస్ధితుల్లోనూ అమరావతిలో ఉన్న రాజధాని అక్కడే ఉంటుంది. లేనిపోని అనుమానాలు పెట్టుకోవద్దు. అమరావతి రాష్ట్రానికి హెడ్‌క్వార్టర్‌. అక్కడే ఉంటుంది. అది కొనసాగి తీరుతుంది. కొంత మంది లేనిపోని ప్రచారాలు చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు. వాటిని నమ్మవద్దు.’’

తాడేపల్లిలో జగన్ ఇంటి గృహ ప్రవేశ సమయంలో ఆర్కే రోజా ఏమన్నారంటే..

‘‘అమరావతిని తరలిస్తారని.. రాజధానికి జగన్‌ వ్యతిరేకమని చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలు చేస్తూ తన మంత్రులతో మాట్లాడిస్తున్నారు. ఆయనకు చెంపపెట్టుగా ఈ రోజు ఇక్కడ జగన్‌ గృహ ప్రవేశం, వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. రాజధానిని కట్టగల సమర్థుడు కాబట్టే జగన్‌ ఇక్కడ స్థలం కొని ఇల్లు కట్టుకున్నారు’’.

Next Story