రెంటికి చెడ్డ రేవడిలా కాంగ్రెస్ మరో భారీ బ్లండర్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Aug 2020 7:30 AM GMT
రెంటికి చెడ్డ రేవడిలా కాంగ్రెస్ మరో భారీ బ్లండర్

కాలం కలిసి రాకపోవటం ఒక ఎత్తు.. విషయాల పట్ల ఎలా రియాక్టు కావాలన్న విషయం మీద సరైన ఆలోచన.. నిజాయితీ లేకుంటే ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందో కాంగ్రెస్ పార్టీని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశాన్ని అత్యధిక కాలం పాలించిన పార్టీగా కాంగ్రెస్ రికార్డును బ్రేక్ చేయటం ఇప్పట్లో ఎవరికి సాధ్యం కాకపోవచ్చన్న మాట వినిపించేది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వరుస తప్పుల్ని చూస్తే.. ఆ మాటలో నిజం లేదని.. వారికివారే.. ప్రత్యర్థులకు అవకాశం ఇస్తున్నారని చెప్పక తప్పదు.

కీలకమైన విషయాల్లో నిర్ణయాల్ని తీసుకోవటంలో తెగువ.. సాహసం చూపని కాంగ్రెస్ పార్టీ.. మారిన కాలానికి తగ్గట్లు తనను తాను మార్చుకోలేదన్న విషయం తెలిసిందే. ఓటుబ్యాంకు రాజకీయాల్ని తెర మీదకు తీసుకొచ్చి.. దాన్ని మిగిలిన పార్టీలు అందిపుచ్చుకునే లోపే.. తనకు తోచినట్లుగా అడ్డదిడ్డంగా రాజకీయ క్రీడను ఆడేసిన కాంగ్రెస్ చాలానే తప్పులు చేసింది. కాలం కలిసి రావటంతో ఆ తప్పులేమీ పెద్దగా కనిపించలేదు.

సరైన రింగు మాష్టర్ రంగంలోకి దిగితే.. షో మొత్తం మారిపోతుంది. మోడీ లాంటి నేత రంగంలోకి దిగిన తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీ తప్పులు ఒక్కొక్కటిగా బయటకు రావటమే కాదు.. పలు అంశాల్లో మోడీ వ్యూహం ముందు కాంగ్రెస్ ఎత్తులు చిత్తు అవుతున్నాయి. దీనికి తోడు గుంటనక్కలాంటి కాంగ్రెస్ పార్టీని నడిపించే అధినేతలు పెద్దవారు కావటం.. మారిన కాలానికి తగ్గట్లు అధినాయకత్వం మారకపోవటం ఆ పార్టీకి ఇప్పుడు శాపంగా మారింది.

మైనార్టీ ఓటుబ్యాంకుతో దేశ రాజకీయాల్లో చక్రంతిప్పిన కాంగ్రెస్ కు.. ముక్కలుచెక్కలుగా ఉన్న మెజార్టీ ఓటు బ్యాంకును ‘జాతీయవాదం’ పేరుతో ఒక చోటుకు చేర్చటం.. మైనార్టీలకు పెద్దపీట వేసే తీరును ఓపెన్ గా తప్పు పట్టేలా.. దేశంలో అందరూ ఒకటే కదా? ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఏమిటన్న? నిలదీత రాజకీయాల్లో అత్యధికుల మనసుల్ని దోచేసుకోవటం తెలిసిందే. దీనికి తోడు అయోధ్య రామాలయం.. ఆర్టికల్ 370 లాంటి ఎన్నో అంశాల్ని ఫైనల్ చేయకుండా మురగపెట్టారు.

ఇలాంటి తప్పులు ఒకటికి ఒకటి పేరుకుపోయి.. జాతి జనుల ఆగ్రహాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న మోడీ ప్రధానమంత్రి అయ్యారు. ప్రజలు ఏమనుకుంటున్నారో.. దాన్ని అమలుచేయటానికి నడుం బిగించారు. ఈ కారణంతోనే మోడీకి అధికారాన్ని సొంతం చేసుకోగలిగారు. ఇలాంటివేళలో తమ స్టాండ్ ను సరి చేసుకోవటం.. తప్పుల్ని ఒప్పులుగా మార్చుకోవాల్సిన కాంగ్రెస్ అందుకు భిన్నంగా మోడీ బాటలో పయనించేందుకు వీలుగా ఆ పార్టీ ఫ్లాగ్ షిప్ అంశాల్ని తమ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తోంది.

ఇంతకాలం అయోధ్యలో రామాలయం విషయంలో ఒక్క అనుకూలమైన ప్రకటన చేయని కాంగ్రెస్.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా గొంతు సవరించుకుంటోంది. అయోధ్యలో రామాలయ నిర్మాణ ఘనత మొత్తం బీజేపీకే చెందటాన్ని తట్టుకోలేకపోతోంది. అందుకే.. తన మాటను మారుస్తూ.. భారతీయులందరి ఆమోదంతోనే రామాలయం నిర్మాణమవుతోందన్న మాటను ఆ పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.

ఇంతకాలం రామాలయానికి అనుకూలంగా ఒక్క మాట మాట్లాడని కాంగ్రెస్.. ఇప్పుడు ఇలా మాట్లాడితే.. మౌనంగా ఉన్న వారు సైతం ఆ పార్టీని తీవ్రంగా తిట్టిపోయటం ఖాయం. ఆ విషయాన్ని మర్చిపోయి అయోధ్యలో రామాలయాన్ని మాట్లాడటం అంటే.. అంతకు మించిన బ్లండర్ మరొకటి ఉండదు. ఇప్పటికే అదే పనిగా ఎదురుదెబ్బలు తిని.. పరాజయ నిరాశలో ఉన్న ఆ పార్టీ ముందస్తు వ్యూహం లేకుండా మాట్లాడటంతో మరింత డ్యామేజ్ తప్పనట్లే. దశాబ్దాల తరబడి రామాలయం విషయంలో కాంగ్రెస్ తీరు దేశ ప్రజలకు తెలిసిందే. అలాంటిది ఇప్పుడు గొంతు సవరించుకుంటే గుర్తించలేనంత పిచ్చితనంతో దేశ ప్రజలు ఉన్నారని ఆ పార్టీ భావిస్తుందా? అన్నది అసలు ప్రశ్న.

Next Story