పీవీ కోసం టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ ఢీ.!

By Medi Samrat  Published on  20 July 2020 7:47 AM GMT
పీవీ కోసం టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ ఢీ.!

టీపీసీసీ ఆధ్వర్యంలో ఈనెల 24 నుంచి పీవీ శత జయంతి ఉత్సవాలు ప్రారంభం అవుతాయని టీపీసీసీ చీఫ్‌, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో పీవీ శత జయంతి ఉత్సవాల కమిటీ సమావేశం జరిగింది. ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి కమిటీ సభ్యులు చర్చించారు. అనంతరం ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విలేకరులకు వివరాలు వెల్లడించారు.

ఈ సంద‌ర్భంగా ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఎవరు ఎన్ని చెప్పినా.. ఎవరు ఏమి అన్నా మాజీ ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావుది కాంగ్రెస్‌ కుటుంబమ‌ని.. కరీంనగర్‌ జిల్లా వంగరలో జన్మించిన ఆయన.. కాంగ్రెస్‌లో సామాన్య‌‌ కార్య‌కర్త స్థాయి నుంచి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి, పీసీసీ చీఫ్‌, ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ప్రధానిగా వివిధ స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహించారని వివరించారుని అన్నారు. రాష్ట్రంలో భూ సంస్కరణల నుంచి.. దేశంలో ఆర్థిక సంస్కరణల వరకు పీవీ ముద్ర ఉందని.. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి ఆయన గట్టెక్కించారని.. ఆయన శత జయంతి వేడుకలు నిర్వహించడం మాకు గర్వంగా ఉంటుందని.. పీవీ మా వాడని గర్వంగా చెప్పుకొంటామ‌ని అన్నారు. దేశంలో ఆర్థిక సంస్కరణలపై జూలై 24న పీవీ తొలి ప్రసంగం చేశారని గుర్తు చేశారు.

జూమ్‌ యాప్‌ ద్వారా పీవీ శత జయంతి ఉత్సవాల్లో 1000 మంది పాల్గొనేలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రసంగాలు వినేలా ఇందిరా భవన్‌లో ఎల్‌ఈడీ స్ర్కీన్స్‌ ఏర్పాటు చేస్తామని అన్నారు. జూమ్‌ యాప్‌ వేదికగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కేంద్ర మాజీ మంత్రులు చిదంబరం, జైరాం రమేశ్‌ ప్రసంగిస్తారని తెలిపారు. అలాగే.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, పీవీ కుటుంబ సభ్యులు వారి సందేశాలను వీడియో రూపంలో పంపుతారని, వాటిని ప్రదర్శిస్తామన్నారు. ఏడాదిపాటు పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు.

ఇదిలావుంటే.. పీవీ శతజయంతి వేడుకలను రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో సీఎం కేసీఆర్ నిర్వ‌హించారు. జూన్‌ 28న హైదరాబాద్‌లోని పీవీ జ్ఞానభూమిలో ఉత్స‌వాల‌ ప్రధాన కార్యక్రమం జ‌రిగింది. ఉత్సవాల నిర్వహణకు రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ‘పీవీ తెలంగాణ ఠీవి’ అని ప్రతి తెలంగాణ బిడ్డ గర్వపడేలా ఆయన చరిత్ర ఉన్నదని, ఆయన గొప్పతనం, చేసిన సేవలు విశ్వవ్యాప్తంగా తెలిసేలా ఏడాది పొడవునా విభిన్న కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు.

అంతేకాదు.. ఉత్స‌వాల సంద‌ర్భంగా పీవీకి కేంద్రం.. భార‌త అత్యున్న‌త పుర‌స్కారం భారతరత్న ప్ర‌క‌టించాల‌ని.. ఆ పుర‌స్కారం ఇవ్వాల్సిందిగా కోరుతూ శాసనసభ, మంత్రివర్గంలో తీర్మానం చేసి తానే స్వయంగా ప్రధానికి అందించనున్నట్లు సీఎం కేసీఆర్ అన్నారు. అయితే పీవీ కోసం అధికార, ప్ర‌తి ప‌క్షాలు ఢీ అంటే ఢీ అన‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరేళ్లు అవుతోంది. పీవీ మీద ఇప్పుడు ప్రదర్శిస్తున్న ప్రేమాభిమానాలు ఇప్పటివరకూ ఎందుకు ఏమయ్యాయి. పీవీని ఘనంగా స్మరించుకోవటమే నిజమైనప్పుడు.. ఆరేళ్ల కాలంలో ఏదో ఒక రోజున ఏదో ఒక ప్రాజెక్టుకో.. ఆయన జన్మించిన జిల్లాకు ఆయన పేరు పెట్టటం లాంటివి ఏదో ఒకటి చేయొచ్చు. ఇప్పటివరకూ చేయని దానికి భిన్నంగా.. ఇప్పుడు చేయాలన్న దాని వెనకున్న మర్మం ఏమిటి? అన్నది అసలు ప్రశ్న.

అలాగే కాంగ్రెస్ కూడా.. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా పీవీ విష‌య‌మై అధికార టీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. క‌రోనాతో రాష్ట్రం కొట్టుమిట్టాడుతున్న వేళ.. రాష్ట్ర ప్ర‌జ‌ల త‌రుపున పోరాడాల్సిన కాంగ్రెస్‌.. అధికార టీఆర్ఎస్‌తో పీవీ శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌పై పోటీ ప‌డ‌టం ప‌ట్ల తెలంగాణ‌లో తీవ్ర‌మైన చ‌ర్చ జ‌రుగుతుంది. ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేకున్నా.. పీవీ సామాజిక వ‌ర్గం మెప్పు పొంది.. త‌ద్వారా రానున్న ఎన్నిక‌ల‌లో ల‌బ్ది పొందేలా ఉంది అధికార‌.. ప్ర‌తిప‌‌క్ష పార్టీల తీరు అంటూ అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Next Story