ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేస్తున్న కేసీఆర్

By సుభాష్  Published on  3 July 2020 7:21 AM GMT
ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేస్తున్న కేసీఆర్

వేలెత్తి చూపించటాళ్లు.. విమర్శలు.. ఇలా అన్నీ అయ్యాక.. ఇప్పటికి కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర సర్కారు. మహమ్మారిని నిర్దారించేందుకు వేగంగా ఫలితాలు చెప్పే ర్యాపిడ్ టెస్టులు (ర్యాపిడ్ యాంటీజెన్ డిటెక్షన్ టెస్టు) చేయించేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. అనుమానితులకు కేవలం పదిహేను నిమిషాల్లో వైరస్ ఉందో లేదో అన్న విషయాన్ని నిర్దారించే యాంటీజెన్ పరీక్షను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇప్పుడు అనుసరిస్తున్న విధానంలో ఫలితాలు వెల్లడి కావటానికి మూడు.. నాలుగు రోజులు పడుతున్న నేపథ్యంలో.. తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఇటీవల కాలంలో తెలంగాణలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో రోజువారీగా కేసుల నమోదు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ నేపథ్యంలో అనుమానితుల్లో అదుర్దా పెరుగుతోంది. ఇప్పుడు అనుసరిస్తున్న విధానంలో పరీక్షల ఫలితాలు ఆలస్యం కావటం.. రోగ తీవ్రత పెరిగిపోవటంతో.. ర్యాపిడ్ టెస్టుల్ని పెద్ద ఎత్తున చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు ఐసీఎంఆర్ సైతం అనుమతి ఇచ్చింది. దీంతో.. రెండు మూడురోజుల వ్యవధిలో యాభై వేల కిట్లు తెలంగాణకు రానున్నాయి.

ఈ కిట్లు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఫలితం పాజిటివ్ వస్తే.. వారిని వెంటనే ఆసుపత్రికి కానీ.. ఇంట్లో ఐసోలేషన్ కు కానీ పంపుతారు. ఒకవేళ నెగిటివ్ వస్తే.. వారికి ఇప్పటి వరకు చేస్తున్న పరీక్షలు చేస్తారు. దీంతో.. రోగ లక్షణాలు ఉన్న వారిని రెండు దశల్లో స్కాన్ చేసేందుకు కుదురటంతో పాటు.. పాజిటివ్ గా ఉన్న వారిని వేగంగా నిర్దారించేందుకు అవకాశం లభిస్తుంది. ఇప్పుడున్న విధానంలో వైరస్ లోడ్ ఉన్న వారు పరీక్షలు చేయించుకొని.. ఫలితాలు వచ్చేసరికి మూడు.. నాలుగు రోజులు పడుతోంది. అప్పటికి రోగ తీవ్రత మరింత పెరుగుతోంది. ఈ కిట్లతో అలాంటి ఇబ్బందిని అధిగమించే వీలుంటుంది.

ఇప్పటివరకూ చేస్తున్న ఆర్ టీ-పీసీఆర్ పరీక్షకు రూ.2200 ఖర్చు అవుతుంటే.. ఈ యాంటీజెన్ పరీక్షకు రూ.500 మాత్రమే అవుతుంది. దీనికి మించి వేగంగా ఫలితాలు వచ్చే వీలు ఉంటుంది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ పరీక్షా విధానాన్ని అమలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆలస్యంగా ఈ పరీక్షలకు అనుమతి కోరిందని చెప్పాలి. వెయ్యికి పైగా కేసులు రోజువారీగా నమోదవుతున్న వేళలో.. పాజిటివ్ లక్షణాలు ఉన్న వారిని మరింత వేగంగా గుర్తించేందుకు తాజా నిర్ణయం సాయం చేస్తుంది. అయితే.. ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాల్సి ఉందన్న మాట వినిపిస్తోంది. పోనీలే.. ఇప్పటికైనా నిర్ణయం తీసుకున్నారని సంతోషపడటం మంచిదేమో?

Next Story