కొంచెం కూడా తీరు మార్చుకోని హైదరాబాద్ వాసులు.. మాస్క్ పెట్టుకోండయ్యా..!

By సుభాష్  Published on  3 July 2020 7:07 AM GMT
కొంచెం కూడా తీరు మార్చుకోని హైదరాబాద్ వాసులు.. మాస్క్ పెట్టుకోండయ్యా..!

కరోనా వైరస్ విపరీతంగా ప్రబలుతోంది.. కొంచెం అయినా మనల్ని మనం కాపాడుకోవాలంటే మాస్క్ లు వాడడమే ఉత్తమమని ఎంతో మంది నిపుణులు చెబుతున్నారు. కానీ హైదరాబాదీల తీరులో మాత్రం ఏ మాత్రం మార్పు కనపడడం లేదు. ఇప్పటికే తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా వైరస్ పాజిటివ్ వస్తున్న వారి సంఖ్య ప్రభుత్వాన్ని అంతకంతకూ కలవరపెడుతోంది. అయినా కూడా మాస్క్ లు వేసుకోవడంతో హైదరాబాద్ వాసులు అలసత్వం ప్రదర్శిస్తూ ఉన్నారు.

మాస్కులు వేసుకోని వారిపై అధికారులు కేసులు బుక్ చేస్తున్న సంగతి తెలిసిందే..! ఒక్క హైదరాబాద్ లోనే 14,931 మంది మాస్క్ లు లేకుండా అధికారులకు దొరికిపోయారు. కనీసం బాధ్యత లేకుండా ప్రవర్తించకపోవడం వలనే కరోనా కేసులు బాగా పెరిగిపోతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రామగుండంలో మాస్క్ లు లేకుండా అధికారుల కంటపడిన వారి సంఖ్య 8290, ఖమ్మంలో 6,372 మంది మాస్కులు పెట్టుకోకుండా నిబంధనలను ఉల్లంఘించారు. మొత్తం 70485 మంది మాస్కులను పెట్టుకోకుండా నిబంధనలను ఉల్లంఘించారు. సైబరాబాద్ పరిధిలో మాత్రం కేవలం 2996 మందిని మాత్రమే మాస్క్ లేకుండా రోడ్ల మీదకు వచ్చి అధికారులకు అడ్డంగా బుక్ అయ్యారు.

కొందరిని పోలీసులు రోడ్ల మీద ఆపి ఛలాన్లు వేస్తూ ఉండగా, ఎవరైతే కనీసం మాస్క్ లు లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారో వాళ్ళను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో గుర్తించి ఈ-ఛలాన్ లు విధించారు.

కరోనా లక్షణాలు లేకపోయినా మాస్కులు తప్పకుండా ధరించాలని వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఎవరికి కరోనా ఉందో, ఎవరికి లేదో గుర్తించడం చాలా కష్టం అందుకే ఎవరికి వారు స్వచ్ఛంధంగా మాస్కులు వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతే ప్రభుత్వాలు కూడా చేతులెత్తేసే అవకాశం ఉందని కొందరు హెచ్చరిస్తూ ఉన్నారు.

పోలీసులకు ఇప్పటికే ఎన్నో బాధ్యతలను అప్పగించారు అధికారులు. మాస్కులు లేకుండా బయటకు వస్తూ ఉన్నవారిపై కూడా నిఘా ఉంచడమంటే వారికి కూడా మరింత భారమే.. ముఖ్యంగా కరోనా బారిన పడుతున్న పోలీసుల సంఖ్య కూడా అధికంగా ఉంది. టెక్నాలజీని ఉపయోగించి మాస్కులు లేకుండా వెళుతున్న వారిని గుర్తించడం పెద్ద కష్టం కాకపోయినా మనుషుల్లో మార్పు రావాలి. స్వచ్ఛంధంగా ప్రజలే మాస్కులు పెట్టుకుని బయటకు వచ్చి బాధ్యతగా మెలగాలని తెలంగాణ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

Next Story