యనమల లేఖలో తప్పులు లెక్క విప్పిన ఉమ్మారెడ్డి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 July 2020 5:22 AM GMT
యనమల లేఖలో తప్పులు లెక్క విప్పిన ఉమ్మారెడ్డి

సీనియర్ నేతగా.. శాసన సభకు సంబంధించిన అంశాల మీద విపరీతమైన పట్టు ఉన్న నేతగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు మంచి పేరుంది. వ్యవసాయ కళాశాలలో ప్రొఫెసర్ గా పిల్లలకుపాఠాలు చెప్పుకునే ఆయన.. ఎన్టీఆర్ పుణ్యమా అని తెలుగుదేశం పార్టీలో చేరారు. సౌమ్యుడిగా పేరు పొందినప్పటికీ బాబు చట్రంలో ఇరుక్కుపోయిన బాధితుల్లో ఆయన ఒకరుగా చెబుతారు. ఈ కారణంతోనే ఆయనకు సరైన సమయంలో ఎలాంటి పదవి దక్కలేదన్న మాట వినిపిస్తుంటుంది.

కొన్నేళ్ల క్రితం టీడీపీకి గుడ్ బై చెప్పేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. ప్రభుత్వ చీఫ్ విప్ గా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఏపీ గవర్నర్ కు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఒక లేఖ రాయటం.. అందులో జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో.. రంగంలోకి దిగిన ఉమ్మారెడ్డి యనమల లేఖలోని అంశాల పస లెక్క తేల్చే పనిలో పడ్డారు. యనమల లేవనెత్తిన అంశాలపై ఫైర్ అయిన ఉమ్మారెడ్డి.. ఉతికి ఆరేసినంత పని చేశారు. యనమల లేఖలోని తప్పుల్ని ఎత్తి చూపారు.

పాలనా వికేంద్రీకరణ.. సీఆర్డీఏ రద్దు బిల్లుల్ని ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపాలంటూ ఏపీ గవర్నర్ కు లేఖ రాయటంపై ఉమ్మారెడ్డి సీరియస్ అయ్యారు. ఈ లేఖను చూస్తే.. యనమలకు కనీస పరిజ్ఞానం లేదన్న విషయం స్పష్టం కావటమే కాదు.. ఇలా చేసి ప్రజల్లో ఎందుకు నవ్వుల పాలు అవుతారని ప్రశ్నించారు.

రాజ్యాంగ నిబంధనలకు లోబడి శాసనసభల నిర్వహణ ఉంటుందన్న ఉమ్మారెడ్డి.. యనమలకు ఆ అవగాహన లేకపోవటం శోచనీయమన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో తొలిసారి ఆమోదించిన రెండు బిల్లుల్నిజనవరి 22న మండలికి వచ్చినప్పుడు అక్కడి గ్యాలరీలో కూర్చొని టీడీపీ అధినేత చంద్రబాబు సైగలు చేసి బిల్లులు ఆమోదించకుండా అడ్డుకున్నారని.. సభను నిరవధికంగా వాయిదా వేయించారన్నారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై కౌన్సిల్ మూడు నెలల పాటు నిర్ణయం తీసుకోనందున వాటిని అసెంబ్లీ ఆమోదించి మరోసారి మండలికి పంపితే మోకాలు అడ్డారన్నారు.

ద్రవ్య వినిమయబిల్లును ఆమోదించకుండా చేసి.. సభను వాయిదా వేయించారన్నారు. ఈ కారణంతోనే ప్రభుత్వ ఉద్యోగులకు జులై ఒకటిన రావాల్సిన జీతాలు ఆలస్యమయ్యాయని చెప్పారు. 192(2) (బి) ప్రకారం అసెంబ్లీ పంపిన బిల్లును మూడు నెలల తర్వాత కూడా కౌన్సిల్ ఆమోదించకున్నా.. ఆమోదించినట్లేనని గుర్తు చేసిన ఆయన.. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం రెండోసారి బిల్లును అసెంబ్లీ ఆమోదించి మండలికి పంపితే అక్కడ ఆమోదం పొందకున్నా.. ద్రవ్య బిల్లు 15 రోజులు.. సాధారణ బిల్లు ముప్ఫై రోజుల తర్వాత ఆమోదం పొందినట్లే పరిగణిస్తారని చెప్పారు.

రాష్ట్ర మంత్రివర్గం రెండు బిల్లుల్ని ఆమోదించిన తర్వాతే గవర్నర్ ఆమోదానికి పంపుతారన్నకనీస పరిజ్ఞానం యనమలకు లేకపోవటం ఏమిటి? అని ప్రశ్నించారు. టీడీపీ నేతల తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని.. ఇలాంటివేళలో.. బిల్లులు ఆమోదించొద్దని డిమాండ్ చేసి మరింత నవ్వులపాలు కావాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. నిజమే.. అధినేత దగ్గర మైలేజీ కోసం ఇలా లేఖలు రాసి యనమల తన స్థాయిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందంటారా?.

Next Story