జగన్ పార్టీలో మోస్ట్ పవర్ ఫుల్.. ఆ ముగ్గురే

By సుభాష్  Published on  2 July 2020 5:02 AM GMT
జగన్ పార్టీలో మోస్ట్ పవర్ ఫుల్.. ఆ ముగ్గురే

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయంపై పార్టీలో ఆసక్తికర చర్చకు తెర తీసింది. పార్టీలో జగన్ తర్వాత అత్యంత శక్తివంతమైన నేత ఎవరంటే.. అందరి చూపు విజయసాయి రెడ్డి మీద పడుతుంది. అధినేతకు అత్యంత దగ్గరగా ఉండటమేకాదు.. పార్టీ రచించే ప్రతి వ్యూహంలోనూ ఆయన కీలకభూమిక పోషించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. పార్టీని మరింత బలోపేతం చేయటం కోసం తాజాగా ముగ్గురు ముఖ్యనేతలకు బాధ్యతలు అప్పజెప్పారు.

తాజాగా అప్పజెప్పిన బాధ్యతల్ని చూస్తే.. పార్టీలో తిరుగులేని పవర్ ఫుల్ నేతలు ఎవరన్న విషయంపై క్లారిటీ వస్తుంది. ఏపీలోని పదమూడు జిల్లాల్లో పార్టీని మరింత బలోపేతం చేయటం కోసం ప్రత్యేక బాధ్యతల్ని తనకు దగ్గరైన ముగ్గురునేతలకు అప్పజెప్పారు జగన్. అందులో భాగంగా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు శ్రీకాకుళం.. విజయనగరం.. విశాఖలను రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డికి అప్పజెప్పారు.

అదే సమయంలోఉభయ గోదావరి జిల్లాలు.. కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాలను టీటీడీ ఛైర్మన్.. తనకు ఆప్తుడైన వైవీ సుబ్బారెడ్డికి అప్పజెప్పారు. సీమలోని కర్నూలు.. అనంతపురం.. కడప.. ప్రకాశం.. నెల్లూరు జిల్లాల పార్టీ వ్యవహారాల్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పజెబుతూ నిర్ణయం తీసుకున్నారు. తాజా ఎంపికను చూస్తే.. తనకు అత్యంత సన్నిహితులు.. పూర్తిస్థాయిలో విశ్వసనీయమైన నేతలుగా పేరున్న ముగ్గురికే కీలక బాధ్యతలు అప్పజెప్పిన తీరు చూస్తే.. పార్టీలో జగన్ తర్వాత మోస్ట్ ఫవర్ ఫుల్ నేతలు వారేనని ఇట్టే అర్థం కాక మానదు.

Next Story