'భారత్‌తో సంబంధాలు మెరుగుపడాలి.. లేకుంటే..'

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి కాలంలో భారత్‌పై అత్యధిక సుంకాలు విధించారు.

By -  Medi Samrat
Published on : 9 Oct 2025 8:45 AM IST

భారత్‌తో సంబంధాలు మెరుగుపడాలి.. లేకుంటే..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి కాలంలో భారత్‌పై అత్యధిక సుంకాలు విధించారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తత నెలకొంది. దీనిని వ్య‌తిరేకిస్తూ అమెరికా కాంగ్రెస్‌కు చెందిన 19 మంది ఎంపీల బృందం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు లేఖ రాసింది. ఈ లేఖ ద్వారా ఎంపీలు సింబాలిక్‌గా వైట్‌హౌస్‌కు బలమైన సందేశం ఇవ్వడానికి ప్రయత్నించారు. ఎంపీలు డెబోరా రాస్, కో ఖన్నా నేతృత్వంలో బృందం లేఖ రాసింద‌ని సమాచారం.

భారత్‌తో అమెరికా సంబంధాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలని ఎంపీలు అధ్యక్షుడు ట్రంప్‌ను అభ్యర్థించడం గమనార్హం. దీనితో పాటు రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతను తగ్గించడంపై దృష్టి పెట్టాలి. భారత్‌పై విధించిన సుంకాన్ని తగ్గించాలని ఎంపీలు సూచించారు. అక్టోబరు 8న ఎంపీలు ఈ లేఖ రాశారని.. భారత్‌పై 50 శాతం సుంకం విధించడం వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌తో అమెరికా సంబంధాలు చెడిపోయాయని.. దీంతో ఇరు దేశాలపై ప్రతికూల ప్రభావం పడిందని లేఖలో పేర్కొన్నారు.

US చట్టసభ సభ్యులు భారతదేశాన్ని ఒక వాణిజ్య కేంద్రంగా పేర్కొన్నారు. సెమీకండక్టర్ల నుండి ఆరోగ్య సేవలు, శక్తి వరకు వివిధ రంగాలలో కీలకమైన వస్తువుల కోసం అమెరికన్ తయారీ భారతదేశంపై ఆధారపడి ఉందని అన్నారు. నిరంతరం పెంచుతున్న సుంకాలు భారత్‌-అమెరికా మధ్య సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయని, అమెరికా కుటుంబాల ఖర్చులపై ప్రభావం చూపుతోందని, ప్రపంచ స్థాయిలో అమెరికా కంపెనీల పోటీతత్వాన్ని దెబ్బతీస్తోందని ఎంపీలు హెచ్చరించారు.

Next Story