చైనా.. అమెరికా అధికారుల విషయంలో పెద్ద ప్లాన్ వేసిందిగా..!
Suspected Chinese spy 'honey-trapped' top US politicians. చైనాను అమెరికా, భారత్ వంటి దేశాలు ఎప్పటికప్పుడు నిలవరిస్తూ
By Medi Samrat Published on 24 Dec 2020 6:26 PM IST
చైనాను అమెరికా, భారత్ వంటి దేశాలు ఎప్పటికప్పుడు నిలవరిస్తూ ఉన్నాయి. కానీ అమెరికా రహస్యాలను తెలుసుకోడానికి చైనా ఎన్నో ప్రణాళికలను రచిస్తూ ఉంది. కొన్ని విషయాలను హనీ ట్రాప్ (అందమైన అమ్మాయిలతో వేసే వలపు వల) ద్వారా రాబట్టాలని చైనా ప్రయత్నాలు ఎప్పటి నుండో మొదలుపెట్టిందనే విషయాన్ని అమెరికా తాజాగా బయటపెట్టింది. అమెరికాలోని అనేక మంది అగ్ర రాజకీయనేతలపై చైనా వలపు వల విసిరినట్టు.. చైనా ఇంటెలిజెన్స్ సంస్థ కార్యకలాపాలతో సంబంధం ఉందని భావిస్తున్న ఓ యువతి పలువురు మేయర్లతో సహా, రాజకీయ నేతలతో పరిచయాలు పెంచుకుని, అమెరికా ప్రభుత్వానికి సన్నిహితం అయ్యేందుకు ప్రయత్నించిందని అమెరికా చెబుతోంది.
ఈ ఘటన 2011 నుంచి 2015 మధ్యన చోటుచేసుకుంది. చైనా స్టేట్ సెక్యూరిటీ (ఎంఎస్ఎస్) కోసం ఫాంగ్ ఫాంగ్ లేక క్రిస్టీన్ ఫాంగ్ అనే గూఢచారిని ఈ పనులు చేసిందని అనుమానిస్తున్నారు. నిధుల సేకరణ కార్యక్రమాలు, విస్తృతస్థాయిలో పరిచయాలు, వ్యక్తిగత ఆకర్షణ, శృంగార సంబంధాలు ఇలా ఏది వీలైతే అది ఎరవేసి రాజకీయ నేతలను బుట్టలో వేసేందుకు ఫాంగ్ ప్రయత్నించిందని తెలుస్తోంది. ఇద్దరు మేయర్లతో ఆమె లైంగిక సంబంధాలు ఏర్పరచుకుందని సంచలన విషయాలను వెల్లడించింది అమెరికా. 2011లో బే ఏరియా యూనివర్సిటీలో ఓ విద్యార్థినిగా అడుగుపెట్టిన ఆమె ఆ తర్వాత ఎన్నో విషయాలను తన దైన స్టైల్ తో తెలుసుకుంది. ఉన్నతశ్రేణి రాజకీయనేతలతో పరిచయాలు పెంచుకుంటూ వెళుతున్నా కూడా తన వ్యక్తిగత విషయాలను మాత్రం ఎవరికీ తెలియనివ్వలేదు. ఎంతో సంపన్నురాలిగా కనిపించేలా ఓ తెల్లని మెర్సిడెస్ బెంజ్ కారులో తిరుగుతుండేదని తెలుస్తోంది.
ఆమెపై అనుమానంతో అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు పలువురు నేతలను అప్రమత్తం చేశారు. అలాంటి సమయంలో ఫాంగ్ 2015లో అదృశ్యమైంది. వాషింగ్టన్ డీసీలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లాల్సి ఉండగా, ఆ ప్రయాణాన్ని రద్దు చేసుకుని ఉన్నపళాన చైనా వెళ్లిపోయింది. అమెరికా ప్రభుత్వం నుంచి చైనా వ్యవహారాలకు సంంధించిన సమాచారాన్ని సేకరించిందని చైనా చెబుతోంది. స్టూడెంట్ల ముసుగులో చైనా వ్యక్తులు అమెరికాలో కాలేజీల్లో చేరి కీలక సమాచారాన్ని దొంగిలిస్తున్నారని అమెరికా చెబుతోంది.