జీహెచ్ఎంసీ పోరు : మొద‌లైన ప్రధాన‌ పార్టీల క‌స‌ర‌త్తులు

GHMC Elections 2020. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర‌పాల‌క సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నిక‌ల న‌గ‌రా మోగింది.

By Medi Samrat  Published on  17 Nov 2020 7:37 AM GMT
జీహెచ్ఎంసీ పోరు : మొద‌లైన ప్రధాన‌ పార్టీల క‌స‌ర‌త్తులు

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర‌పాల‌క సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నిక‌ల న‌గ‌రా మోగింది. గ్రేట‌ర్ ప‌రిధిలోని 23 శాస‌న‌స‌భా నియోజ‌క‌వ‌ర్గాల పరిధిలో మొత్తం 150 డివిజ‌న్ల‌కు డిసెంబ‌ర్ 1 ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. డిసెంబ‌ర్ 4 ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. రేపటి నుంచి 20వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 21న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 22 మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. డిసెంబర్‌ 1న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఈ సారి ఎన్నికలు జరగనున్నాయి. మ‌రి గ్రేట‌ర్ పోరుకు ఏ పార్టీ ఎలా సిద్ద‌మ‌వుతుందో ఓ సారి చూద్దాం.

తెలంగాణ రాష్ట్ర స‌మితి( టీఆర్ఎస్‌) : అధికార టీఆర్‌ఎస్‌ ఎన్నికలకు సన్నద్ధమైంది. పార్టీ ఎమ్మెల్యేలను డివిజన్ల బాట పట్టించింది. జీహెచ్‌ఎంసీకి చెందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లను గెలిచి తీరాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇప్పటికే పూర్తయిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలను, కొత్తగా చేపట్టే పనులకు శంకుస్థాపనల కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇక అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలోనూ గ‌త శాస‌న‌స‌భ ఎన్నిక‌ల సంద‌ర్భంగా అనుస‌రించిన వ్యూహాన్నే అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న కార్పొరేట‌ర్ల‌లో అత్య‌ధిక శాతం మందికి మ‌రోసారి టికెట్లు ఇవ్వాల‌నుకుంటున్న‌ట్లు స‌మాచారం. తీవ్ర‌మైన అభియోగాలుండి పార్టీకి న‌ష్ట‌దాయ‌కం.. త‌ప్ప‌నిస‌రి అనుకున్న వారిని మాత్ర‌మే మిన‌హాయించాల‌ని పార్టీ బావిస్తోంది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలు, డివిజన్ల వారీగా మంత్రులు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. జిల్లాల నుంచి గ్రేటర్‌ ఎన్నికల ప్రచారానికి పార్టీ నేతలను తరలించే ప్రక్రియకూ శ్రీకారం చుట్టింది. ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గాల వారీగా అభ్య‌ర్థుల ఎంపిక కార్యాచ‌ర‌ణ పూర్తి చేసింది. ఇక నోటిఫికేష‌న్ వెలువ‌రించ‌డంతో.. త‌మ అభ్య‌ర్ధుల జాబితాను నేడో, రేపో వెలువ‌రించ‌నుంది.

భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) : దుబ్బాక ఉప ఎన్నిక ఇచ్చిన విజయంతో ఊపుమీదున్న బీజేపీ.. గ్రేటర్‌ పీఠంపైనా కాషాయ జెండా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకు తగినట్లుగా ఆ పార్టీ జాతీయ నాయకత్వం పావులు కదుపుతోంది. ఇత‌ర పార్టీల నుంచి ముఖ్య‌నేత‌ల చేరిక‌ల‌పై దృష్టి సారించింది. బిహార్ ఎన్నిక‌ల్లో భాజ‌పా విజ‌యంలో కీల‌క‌పాత్ర వ‌హించిన భూపేంద్ర యాద‌వ్‌ను రంగంలోకి దింపింది. గ్రేట‌ర్ ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇన్‌చార్జులుగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల‌ను, ఇత‌ర సీనియ‌ర్ నాయ‌కుల‌కు డివిజ‌న్ల బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఇప్ప‌టికే డివిజ‌న్ల వారీగా స‌ర్వేలు నిర్వ‌హించి బ‌ల‌మైన నేత‌ల్ని గుర్తించింది. ఆశావ‌హుల నుంచి ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించింది. పార్టీ నుంచి గెలిచిన, ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన సిట్టింగ్ కార్పొరేటర్ల‌కు టికెట్ ఇవ్వాల‌ని భాజ‌పా సూత్ర‌పాయంగా నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డిన రోజే అభ్య‌ర్ధుల తొలి జాబితాను ప్ర‌క‌టించాల‌ని నిర్ణ‌యించింది. తొలి విడుత‌లో 40 డివిజ‌న్ల‌కు అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

కాంగ్రెస్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం సర్వశక్తులూ ఒడ్డటానికి కాంగ్రెస్‌ పార్టీ సిద్ధపడుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక ఇచ్చిన షాక్ నుంచి కాంగ్రెస్ ఇంకా కోలుకున‌ట్లు క‌నిపించ‌డం లేదు. ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థికి డిపాజిట్ కూడా ద‌క్క‌లేదు. ఇప్ప‌టికే ఆ పార్టీకి చెందిన కొంద‌రు ముఖ్య నాయ‌కులు భాజ‌పా తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేప‌థ్యంలో అభ్య‌ర్ధుల ఎంపికలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల‌ని పార్టీ నిర్ణ‌యించింది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జ్ మాణికంఠాగూర్ న‌గ‌ర నేత‌ల‌తో సమావేశ‌మై ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షిస్తున్నారు. మాజీ మంత్రి మ‌ర్రిశ‌శిధ‌ర్ రెడ్డి అధ్య‌క్షుడిగా ఏఐసీసీ అధికార ప్ర‌తినిధి దాసోజు శ్ర‌వ‌ణ్ క‌న్వీన‌ర్‌గా ఏర్పాటైన ఎన్నిక‌ల మేనిఫెస్టో క‌మిటీ క‌స‌ర‌త్తు తుదిద‌శ‌కు చేరుకుంది. కీల‌క నేత‌లు డివిజ‌న్ల వారిగా బాధ్య‌త‌లు తీసుకోవాల‌ని సూచించింది. మొత్తానికి మేనిఫెస్టోపైనే ఆ పార్టీ ఆశ‌లు పెట్టుకున్న‌ట్లు క‌నిపిస్తోంది.

మ‌జ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్‌(ఎంఐఎం) : జీహెచ్ఎంసీ పాల‌క మండ‌లిలో రెండో అతిపెద్ద పార్టీ అయిన ఎంఐఎం.. ఎన్నిక‌ల‌కు ప‌క్కా వ్యూహంతో బ‌రిలోకి దిగుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో 44 స్థానాలు ద‌క్కించుకున్న ఆ పార్టీ మ‌రో సారి స‌త్తా చాటాల‌ని బావిస్తోంది. ఎన్నిక‌ల్లో పోటిచేసేందుకు ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్ధుల నుంచి ద‌ర‌ఖాస్తులను ఆహ్వానించింది. తెరాస‌కు మిత్ర‌ప‌క్షంగా ఉన్న ఆపార్టీ ఈ సారి అదే పంథాతో ముందుకెళ్లేందుకు స‌న్న‌ద్దమ‌వుతోంది. ఇప్ప‌టికే సీఎం కేసీఆర్‌తో స‌మావేశ‌మైన మ‌జ్లిస్ అధ్య‌క్షుడు అస‌దుద్దీన్ ఓవైసీ ఎన్నిక‌ల వ్యూహం గురించి చ‌ర్చించారు. ప‌ర‌స్ప‌ర అవ‌గాహానతో ప‌నిచేయాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

నేడు ఎన్నిక‌ల క‌మిష‌న్ పార్థ‌సార‌ధి జీహెచ్ఎంసీ నోటిఫికేష‌న్‌తో పాటు షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. రేప‌టి నుంచి నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభం అవుతుండ‌డంతో.. నేడో, రేపో అన్ని పార్టీలు త‌మ అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. మ‌రీ ఈ సారి గ్రేట‌ర్ ప్ర‌జ‌లు ఎవ‌రిని పీఠం పై కూర్చోపెడ‌తారో చూడాలి.


Next Story