హమ్మయ్య.. సూర్య మీద ఎటువంటి చర్యలు లేనట్లే..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Sept 2020 4:56 PM ISTదక్షిణాది నటుడు సూర్య వివాదాలకు దాదాపుగా దూరంగా ఉంటాడు. ఇటీవల నీట్ పరీక్షల విషయంలో చోటుచేసుకుంటున్న ఆత్మహత్యలపై సూర్య స్పందించాడు. ‘విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం అత్యంత విషాదమని, ఇది తన మనసుని ఎంతగానో కలచివేసింది. కరోనా నేపథ్యంలో ప్రాణభయంతో న్యాయమూర్తులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలిస్తున్నారు. విద్యార్థులను మాత్రం భయం లేకుండా పరీక్షలు రాయమని ఆదేశిస్తారు’అని ట్వీట్ చేశాడు. సూర్య ట్వీట్ ను చాలా మంది సమర్థించారు. మరికొందరు విమర్శలు చేశారు.
సూర్య వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు జడ్జి సుబ్రమణ్యం చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. న్యాయమూర్తుల నైతికతపై సూర్య ట్వీట్లు చేశారని అన్నారు. సూర్యకు కోర్టు ఎటువంటి శిక్షను విధిస్తుందో అని ఆయన అభిమానులు కూడా కాస్త టెన్షన్ పడ్డారు. అయితే సూర్య మీద ఎలాంటి కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోబోమని తమిళనాడు రాష్ట్ర హైకోర్టు శుక్రవారం తెలిపింది.
సూర్య వ్యాఖ్యలు అనవసరమైన, సమర్థనీయం కానివని.. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ ప్రజా స్వామ్య పరిరక్షణకు, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తోందని తెలిపింది. అంతేకానీ తమ పనితీరును తక్కువ చేసి మాట్లాడటం సరికాదని వెల్లడించింది. సూర్య మీద ఎటువంటి చర్యలు లేవని తెలియడంతో అభిమానులు ఆనందిస్తూ ఉన్నారు.
ఇక ఈ వివాదం సమిసిపోయినట్లేనని భావిస్తూ ఉన్నారు. నీట్ పరీక్షల విషయంలో పలు రాష్ట్రాల్లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై పలువురు ప్రముఖులు స్పందించారు. ఇలాంటి కష్టకాలంలో పరీక్షలు అవసరమా అని ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.