నాకు న్యాయంపై నమ్మకం ఉంది.. ఇక ట్వీట్లు చేయను
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Aug 2020 3:46 AM GMTసీయం జగన్ గారూ పెద్ద కుట్ర జరుగుతోంది అంటూ హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..! ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తెలీకుండా ఆయన వెనుక ఉన్న వాళ్లు ఏదో చేస్తున్నారని చెప్పుకొచ్చారు హీరో రామ్.
“సీఎంను తప్పుగా చూపించడానికి పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది. వైఎస్ జగన్ గారూ, మీ కింద పనిచేసే కొంతమంది మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల మీ ప్రతిష్ఠకు, మేం మీమీద పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ కలుగుతోంది. అలాంటి వాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నాం” అంటూ రామ్ ట్విట్టర్ లో స్పందించారు. “ఏపీ గమనిస్తోంది” అంటూ హ్యాష్ టాగ్ కూడా పెట్టారు.
‘హోటల్ స్వర్ణ ప్యాలస్ ని రమేష్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్ గా మార్చక ముందు , ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది. అప్పుడీ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు ?’ అని ప్రశ్నించారు రామ్.
రమేశ్ ఆసుపత్రి వ్యవహారంపై ఏసీపీ సూర్యచంద్రరావు మీడియాతో మాట్లాడారు. డాక్టర్ మమత, సౌజన్యలను విచారించామని.. రమేశ్ చౌదరి అల్లుడు కల్యాణ్ చక్రవర్తి ఈరోజు విచారణకు రావాల్సి ఉందని, కానీ ఆరోగ్య సమస్యలతో రెండు వారాలు క్వారంటైన్ లో ఉండాల్సి ఉందని ఆయన సమాచారం అందించారని అన్నారు. వయోవృద్ధులకు తప్ప మరెవ్వరికీ విచారణ నుంచి మినహాయింపు లేదని, ప్రతి ఒక్కరూ విచారణకు రావాల్సిందేనని అన్నారు. వృద్ధులైతే తామే వారి వద్దకు వెళ్లి విచారిస్తామని ఏసీపీ వివరించారు.
తాము ఎంతో తీవ్రంగా పరిగణించి, దర్యాప్తు జరుపుతున్నామని, ఆటంకం కలిగించాలని చూస్తే హీరో రామ్ కు కూడా నోటీసులు ఇస్తామని స్పష్టం చేశారు.
I believe in Justice and im sure the real culprits will be punished no matter who they are.. related or not..I won’t be tweeting about this anymore as I’ve said all I had to..
Jai Hind! 🙏
— RAm POthineni (@ramsayz) August 16, 2020
రామ్ తాజాగా మరో ట్వీట్ చేశారు. "నాకు న్యాయంపై నమ్మకం ఉంది. నిజమైన దోషులు ఎవరైనా, ఎవరికి చెందినవారైనా తప్పకుండా శిక్షించబడతారని కచ్చితంగా చెప్పగలను. ఈ వ్యవహారంలో ఇక ట్వీట్లు చేయాలనుకోవడంలేదు. ఈ వ్యవహారంలో చెప్పాల్సిందంతా ఇప్పటికే చెప్పేశాను" అని ట్వీట్ లో చెప్పుకొచ్చారు. విచారణలో అంతరాయాలు సృష్టించాలనుకునే ఎవరికైనా నోటీసులు పంపుతామని ఏసీపీ సూర్యచంద్రరావు చెప్పిన తర్వాతనే రామ్ ట్వీట్ వచ్చింది.