రమేష్ ఆసుపత్రి.. అధిక ఫీజులు కూడానా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Aug 2020 11:15 AM GMT
రమేష్ ఆసుపత్రి.. అధిక ఫీజులు కూడానా..?

విజ‌య‌వాడ‌ నగరంలోని స్వర్ణ ప్యాలెస్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. స్వర్ణ ప్యాలెస్‌ రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో పెయిడ్ క్వారంటైన్ నడుస్తోందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రమేష్ ఆసుపత్రి గురించి తీవ్రమైన చర్చ జరుగుతున్న సమయంలో.. ఆ ఆసుపత్రి యాజమాన్యం భారీగా ఫీజులు వసూలు చేస్తోందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజుకు 3850 రూపాయలు వసూలు చేయమని ఆదేశాలు ఇచ్చింటే.. రమేష్ ఆసుపత్రి యాజమాన్యం 35000 రూపాయలు వసూలు చేస్తోందని తెలుస్తోంది.

'ప్రభుత్వ సూచనల ప్రకారం.. రోజుకు ఒక్కో పేషెంట్ దగ్గర నుండి 3850 రూపాయలు వసూలు చేయాల్సి ఉంది. మందుల విషయంలో ప్రత్యేకంగా ఛార్జ్ చేయాల్సి ఉంది. రోజుకు 25000 నుండి 30000 రూపాయల వరకూ ప్రతి రోజూ వసూలు చేశారని కొందరు పేషెంట్స్ తెలిపారు. క్రిటికల్ స్థితిలో ఉన్న పేషెంట్స్ ఎవరూ ఆ ఆసుపత్రిలో లేరు.. అయినప్పటికీ ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు' కృష్ణ జిల్లా కలెక్టర్ మొహమ్మద్ ఇంతియాజ్ మీడియాకు తెలిపారు. గత నెలలో మాత్రమే కృష్ణా జిల్లా మెడికల్, హెల్త్ అధికారులు స్వర్ణ ప్యాలెస్ ను వినియోగించుకోడానికి రమేష్ ఆసుపత్రికి అనుమతులను ఇచ్చింది.

అగ్నిప్రమాదం నుండి బయట పడిన కంచికర్లకు చెందిన వ్యక్తి కూడా ఆసుపత్రి యాజమాన్యం పెద్ద ఎత్తున ఫీజులను వసూలు చేస్తోందని తెలిపారు. 'సీటీ స్కాన్ చేయించుకున్నాక లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉందని తెలియడంతో ఆంధ్ర ఆసుపత్రికి వెళ్లాం.. అక్కడ రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేయమని అడిగారు.. అయితే తాము ఎలాంటి బిల్ ఇవ్వమని చెప్పారు. దీంతో తాము రమేష్ హాస్పిటల్స్ కి వెళ్లాం.. వాళ్ళు 85000 డిపాజిట్ చేయమని అడిగారు.. మేము 60000 మాత్రమే డిపాజిట్ చేసాము. కానీ ప్రతి రోజూ మా బిల్లు దాదాపు 35000 రూపాయలు చెప్పారు. ఏడు రోజులకు 3 లక్షల నుండి 4 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. గురువారం నాడు ఆసుపత్రిలో అడ్మిట్ అయినా.. శనివారం సాయంత్రం నాటికి కూడా నాకు కోవిద్-19 టెస్ట్ రిజల్ట్ చెప్పలేదు. నాకు ఎటువంటి లక్షణాలు లేవు. అగ్నిప్రమాదం జరిగిన తర్వాత.. ఇంటికి వచ్చేశాను' అని భక్షు అనే పేషెంట్ తెలిపాడు. డాక్టర్ కన్సల్టేషన్ కూడా వీడియో కాల్స్ ద్వారానే జరిగిందని స్పష్టం చేసాడు. తాను అక్కడున్న సమయంలో నర్సులు పీపీఈ కిట్స్ లో వచ్చి మందులను ఇచ్చే వాళ్లు. భోజనం ప్రతి మూడు గంటలకు ఒక సారి పంపేవాళ్లు అని తెలిపాడు.

స్వర్ణప్యాలెస్​ హోటల్​ నిర్వహణతో తమకు సంబంధం లేదని రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యం వెల్లడించింది. ప్రభుత్వ అనుమతితోనే అక్కడ కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. ఎక్కువ మంది కరోనా రోగులకు వైద్యం అందించాలన్న ఉద్దేశంతో, ప్రభుత్వ అనుమతితోనే స్వర్ణ ప్యాలెస్​ హోటల్​ను కొవిడ్ చికిత్సా కేంద్రంగా మార్చామని రమేష్ ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బందరు రోడ్డులోని రమేష్ ఆసుపత్రిని పూర్తిగా కరోనా రోగుల కోసం కేటాయించామని రమేష్ హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. దానిలో 30 పడకలే ఉండటంతో ఎక్కువ మంది రోగులను చేర్చుకోలేక పోతున్నామన్నారు. కరోనా రోగులను చేర్చుకోవాలని పెద్ద సంఖ్యలో అభ్యర్థనలు రావటంతో అన్ని సౌకర్యాలు హోటల్​లో ప్రభుత్వ అనుమతితోనే కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నామని రమేష్ ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.

Next Story