శ్రీశైలం ఆనకట్ట వద్ద భారీగా ట్రాఫిక్‌జామ్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Sep 2020 3:05 PM GMT
శ్రీశైలం ఆనకట్ట వద్ద భారీగా ట్రాఫిక్‌జామ్‌

సున్నిపెంట సర్కిల్ ‌: శ్రీశైలం జలాశయం పది గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో ఆ సుందర దృశ్యాల్ని చూసేందుకు పర్యాటకులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం కావడంతో సందర్శకుల తాకిడి మరింత పెరిగింది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

శ్రీశైలం లింగాలగట్టు నుంచి స్విచ్‌యార్డు వరకు రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనం అనంతరం సందర్శకులు ఆనకట్టను చూసేందుకు వస్తుండటంతో అక్కడి నుంచి సున్నిపెంట వరకు వాహనాలతో రోడ్లు రద్దీగా మారాయి.

జలాశయం చూసేందుకు వచ్చిన వారు వాహనాలను రోడ్ల పక్కనే నిలిపేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లింగాలగట్టు ప్రాంతంలో చేపలను విక్రయిస్తుండటంతో యాత్రికులు వాహనాలను రోడ్లపై నిలిపి వాటిని కొనుగోలు చేశారు. ట్రాఫిక్‌ను నియంత్రించే క్రమంలో పోలీసులు, యాత్రికుల మధ్య పలుచోట్ల స్వల్ప వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి.

Next Story