ఇంజక్షన్ రెడీ.. హైదరాబాద్‌తో పాటు ఆ నాలుగు రాష్ట్రాలకు..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 Jun 2020 11:20 AM GMTకరోనా నియంత్రణకు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఔషద తయారీ సంస్థ హెటిరో రూపొందించిన 'రెమ్ డెసివిర్' ఔషధాన్ని ముందుగా ఐదు రాష్ట్రాలకు పంపించారు. ‘కోవిఫర్’ పేరుతో ఈ జనరిక్ మందు అమ్మకానికి.. ఇటీవలే గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఈ నేఫథ్యంలోనే భారత్‌లో ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్న నగరాలు ముంబై, ఢిల్లీలతోపాటు తమిళనాడు, గుజరాత్, హైదరాబాద్ నగరాలకు 20,000 వేల ఇంజక్షన్లను అందించినట్లు హెటిరో తెలిపింది.
ఇక రెండో విడతగా కోల్‌కతా, ఇండోర్, భోపాల్, లక్నో, పాట్నా, భువనేశ్వర్, రాంచీ, విజయవాడ, కొచ్చి, త్రివేండ్రం, పనాజీ నగరాలకు పంపనున్నట్లు తెలిపింది. ఇటీవల హెటిరో సంస్థ రెమ్ డెసివిర్ ఔషధాన్ని ‘కోవిఫర్’ ఇంజెక్షన్ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
కోవిఫర్.. 100 మిల్లీగ్రాములు ఇంజెక్షన్ రూపంలో అందుబాటులో ఉంటుందని.. 100 మిల్లీగ్రాముల ఔషధానికి 5,400 రూపాయలు ఖర్చవుతుందని హెటిరో సంస్థ పేర్కొంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కంపెనీలో ఈ ఔషధాన్ని తయారు చేస్తున్నట్లు పేర్కొన్న హెటిరో.. ఈ మందు కేవలం వైద్యల పర్యవేక్షణలో.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికే లభిస్తుందని, రిటైల్‌గా ఇవ్వబడదని తెలిపింది.