చిరంజీవి.. నాకే కాదు ఎందరికో మార్గదర్శి : పవన్ కళ్యాణ్
Pawan Kalyan Wishes To Megastar Chiranjeevi. మెగాస్టార్ చిరంజీవికి.. తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
By Medi Samrat Published on 22 Aug 2021 4:17 AM GMTమెగాస్టార్ చిరంజీవికి.. తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పవన్ ఓ లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్.. తన అన్నయ్య సేవలను కొనియాడారు. లేఖలో.. అన్నయ్య గురించి ఎన్ని చెప్పుకొన్నా కొన్ని మిగిలిపోయే ఉంటాయి. ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే.. ఆయనలోని సుగుణాలను చూస్తూ పెరగడం మరో అదృష్టం. అన్నయ్యను అభిమానించి ఆరాధించే లక్షలాదిమందిలో నేను తొలి అభిమానిని అని పేర్కోన్నారు.
ఆయనను చూస్తూ.. ఆయన సినిమాలను వీక్షిస్తూ.. ఆయన ఉన్నతిని కనులార చూశాను. ఒక అసామాన్యునిగా ఎదిగిన సామాన్యుడని కితాబిచ్చారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయనలోని అద్భుత లక్షణమని.. భారతీయ సినీ యవనికపై తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారని రాసుకొచ్చారు. తెలుగు సినిమాను భారత చలనచిత్ర రంగంలో అగ్రపథాన నిలబెట్టినా.. అవార్డులు రివార్డులు ఎన్ని వరించినా.. నందులు తరలి వచ్చినా.. పద్మభూషణ్ గా కీర్తి గడించినా.. చట్ట సభ సభ్యునిగా.. కేంద్ర మంత్రిగా పదవులను ఆలంకరించినా.. ఆయన తల ఎగరేయలేదని పవన్ లేఖలో పేర్కొన్నారు.
విజయాలు ఎన్ని సాధించినా.. రికార్డులు ఎన్ని సృష్టించినా అదే విధేయత.. అదే వినమ్రత చిరంజీవి సొంతమని.. అందువల్లే ఆయనను లక్షలాది మంది సొంత మనిషిలా భావిస్తారని తెలిపారు. విద్యార్థి దశలోనే సేవాభావాన్ని పెంపొందించుకున్న చిరంజీవి నాడు రక్త నిధిని, నేడు ప్రాణ వాయువు నిధిని స్థాపించి.. కొడిగడుతున్న ప్రాణాలకు ఆయువునిస్తూ తనలోని సేవాగుణాన్ని ద్విగుణీకృతం చేసుకున్నారని అన్నారు. ఆపదలో ఎవరైనా వున్నారంటే ఆదుకోవడంలో ముందుంటారని.. దానాలు.. గుప్తదానాలు ఎన్నో చేశారు.. చేస్తూనే వున్నారని చిరు సేవాగుణాన్ని కీర్తించారు.
కరోనాతో పనులు లేక అల్లాడిపోయిన సినిమా కార్మికుల ఆకలి తీర్చడానికి అన్నయ్య ఎంతో తపనపడ్డారని.. అందువల్లే సినీ కార్మికులు అందరూ చిరంజీవిని తమ నాయకునిగా ఆరాధిస్తూ.. వర్తమాన చరిత్రగా ఆయన జీవితాన్ని లిఖిస్తున్నారని పేర్కొన్నారు. చిరంజీవి మా కుటుంబంలో అన్నగా పుట్టినా మమ్మల్ని తండ్రిలా సాకారని.. తండ్రి స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. ఆ ప్రేమమూర్తి పుట్టిన రోజు సందర్భంగా ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అన్నయ్యకు ఆయురారోగ్యాలతో కూడిన దీర్ఘాయుష్షు ప్రసాదించాలని.. చిరాయువుతో చిరంజీవిగా భాసిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. పవన్ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.