అక్కడ 29వ ఆత్మహత్య..!
కోటాలో ఆత్మహత్యలు ఆగడం లేదు. నవంబర్ 29, బుధవారం నాడు రాజస్థాన్‌లోని కోటాలో..
By Medi Samrat Published on 30 Nov 2023 2:58 PM GMTకోటాలో ఆత్మహత్యలు ఆగడం లేదు. నవంబర్ 29, బుధవారం నాడు రాజస్థాన్‌లోని కోటాలో 21 ఏళ్ల యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యకు చెందిన నీట్ విద్యార్థిని నిషా సింగ్.. కోటలోని మహావీర్ నగర్ 1లోని తన హాస్టల్ గదిలో శవమై కనిపించింది. ఈ ఏడాది రాజస్థాన్‌లోని కోటాలో కోచింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 29 కి చేరింది. 21 ఏళ్ల నిషా సింగ్ బుధవారం రాత్రి తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాలిక మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
నిషా ఇంతకు ముందు ఇంద్రవిహార్ ప్రాంతంలో నివసించేది, ఆమె నవంబర్ 18న మహావీర్ నగర్ 1లోని హాస్టల్‌కి మారింది. ఈ హాస్టల్‌లో 18 గదులు ఉన్నాయి. 12 మంది విద్యార్థినులు అక్కడ ఉంటున్నారు. చనిపోయే ముందు నిషా అర్థరాత్రి తన తండ్రితో ఫోన్ కాల్ మాట్లాడిందని, ఆ తర్వాత హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయిందని చెబుతున్నారు. బాధితురాలి తండ్రి ఆమెకు ఫోన్ చేయగా, నిషా కాల్‌ని ఎత్తలేదు. దీంతో నిషా తండ్రి హాస్టల్ సిబ్బందికి ఫోన్ చేసి నిషా ఎలా ఉందో చూడమని కోరారు. ఎంతసేపటికీ తలుపు తెరవకపోవడంతో, పోలీసులకు సమాచారం అందించారు. వారు తలుపులు పగులగొట్టి గదిలోకి ప్రవేశించి చూడగా.. నిషా మృతదేహం వేలాడుతూ కనిపించింది. బాధితురాలి మృతదేహాన్ని ఎంబీఎస్ ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచారు.