భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చాపకింద నీరులా వ్యాపించిన ఈ వైరస్‌ వల్ల కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటి ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై చర్యలు చేపడుతోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3వేల వరకు చేరింది. ఈ నేపథ్యంలో కరోనాను ఎదుర్కొనేందుకు దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ కొనసాగుతోంది.

ఈ లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 14తో ముగియనుంది. ఇక ప్రధాని మోదీ ఏప్రిల్‌ 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇంట్లో ఉన్న లైట్లను ఆఫ్‌ చేసి క్యాండిల్‌ కానీ, సెల్‌ఫోన్‌ లైట్‌ వెలిగించాలని సూచించిన విషయం తెలిసిందే. ఇక ఏప్రిల్‌ 6న మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేబినెట్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కేబినెట్‌లో మోదీ లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

ఇటీవల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. లాక్‌ డౌన్‌ తర్వాత చేపట్టాల్సిన చర్యలు, జాగ్రత్తలపై సీఎంలకు మోదీ పలు సూచనలు చేశారు.

అయితే తాజా పరిస్థితులు చూస్తుంటే లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారా..? లేదా..? అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ ప్రార్థనల నేపథ్యంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నాలుగు రోజుల్లో దేశంలో పరిస్థితి ఎలా ఉందనేదానిపై మోదీ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

మరో వైపు ఏప్రిల్‌ 14న లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే మళ్లీ పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని కొందరు నిపుణులు అంటున్న మాట. లాక్‌డౌన్‌కు కొందరు మద్దతు పలుకుతుంటే, మరి కొందరు వ్యతిరేకంగా ఉన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే దినసరి కూలీలకు ఆసరగా ఉంటుందని, వ్యాపారులకు కూడా పరిస్థితులు మెరుగుపడతాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల నేపథ్యంలో మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే ఏప్రిల్‌ 6 వరకు ఆగాల్సిందే.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.